కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర క్షేత్రంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అలిపిరి మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద నిత్య పూజలు అందుకుంటున్న పురాతన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని దుండగులు అపహరించారు. పటిష్టమైన భద్రత ఉండే తిరుమల కొండపై విగ్రహం మాయం కావడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలిపిరి మెట్ల మార్గంలో ప్రతిరోజూ దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు పాదయాత్ర చేస్తూ ఈ 7వ మైలు వద్ద ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. దాదాపు 46 సంవత్సరాల క్రితం టీటీడీ మాజీ ఈవో పి.వి.ఆర్.కే. ప్రసాద్ హయాంలో ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. అలాంటి పవిత్ర విగ్రహం చోరీకి గురవ్వడం తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇదేనా చంద్రబాబు చేసిన పక్షాళన – భూమన
ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా స్పందించారు. పాలకమండలి వైఫల్యం వల్లే ఈ అపచారం జరిగిందని మండిపడ్డారు. “వందల ఏళ్ల చరిత్ర ఉన్న తిరుమల కొండపై ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహానికే రక్షణ లేకుండా పోయింది. తిరుమల ప్రక్షాళన చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలి. తనను తాను కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు దీనికి ఏమి సమాధానం చెప్తారు?.
చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే, దొంగతనం చేసిన వ్యక్తిని ‘పిచ్చివాడు’గా ముద్రవేసి కేసును నీరుగార్చేందుకు టీటీడీ విజిలెన్స్ అధికారులు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం ఉందని భూమన తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వందలాది మంది విజిలెన్స్ సిబ్బంది, అంతర్గత నిఘా వ్యవస్థ ఉన్న ఘాట్ రోడ్డులో విగ్రహాన్ని ఎత్తుకెళ్లడం టీటీడీ భద్రతా లోపాలను ఎత్తిచూపుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే నిందితులను పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవాలని స్వామివారి భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.








