అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను (Bangladeshi Nationals) గుర్తించేందుకు బెంగళూరు పోలీసులు(Bengaluru Police) చేపట్టిన వెరిఫికేషన్ డ్రైవ్‌పై (Verification Drive) పశ్చిమ బెంగాల్(West Bengal), అసోంకు (Assam) చెందిన బెంగాలీ మాట్లాడే వలస కార్మికులు తీవ్ర ఆరోపణలు చేశారు. భారతీయ గుర్తింపు పత్రాలు చూపించినప్పటికీ తమను బంగ్లాదేశీయులుగా అనుమానిస్తూ గంటల తరబడి విచారించారని, మొబైల్ ఫోన్లు తనిఖీ చేశారని, కొందరిపై దాడి చేశారని ఆరోపించారు. నెలవారీగా ‘హఫ్తా’ (Monthly Bribe)డిమాండ్ చేశారని కూడా కొందరు ఆరోపించగా.. పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు.
బెంగళూరులోని(Bengaluru) తుబ్రహళ్లిలో నివసించే 42 ఏళ్ల జబ్బర్ అలీ మొండల్(Jabbar Ali Mondal).. తాను పశ్చిమ బెంగాల్‌లోని(West Bengal) ముర్షిదాబాద్ జిల్లాకు(Murshidabad District) చెందినవాడినని, దాదాపు 24 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నానని తెలిపారు. ఆగస్టు 6న తెల్లవారుజామున పోలీసులు తన ఇంటికి వచ్చి వర్థూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఆధార్, ఓటర్ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు చూపించినప్పటికీ పోలీసులు తనను బంగ్లాదేశీయుడిగా అనుమానించారని ఆరోపించారు.
పోలీసులు తన ఫోన్‌ను అన్‌లాక్ చేయించి ఫొటోలు, వ్యక్తిగత డేటాను పరిశీలించారని, అసలు గుర్తింపు పత్రాలను తీసుకుని వాటి కాపీలు ఇచ్చారని చెప్పారు. మొదటి రోజు సుమారు ఐదు గంటలు, మరుసటి రోజు దాదాపు 12 గంటలు స్టేషన్‌లో ఉంచారని ఆరోపించారు. జాతీయ గీతం పాడించారని, తనపై దాడి చేయడంతో ఐదు నుంచి ఆరు రోజులు పని చేయలేకపోయానని, వైద్య ఖర్చులు, ఆదాయ నష్టంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టం జరిగిందని తెలిపారు. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తున్నానని, న్యాయవాదుల ద్వారా పోరాడతానని చెప్పారు.

ఆగస్టు 8న బెంగళూరు పోలీసులు ‘ఆపరేషన్ ముక్తా’(Operation Muktha) పేరుతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఎలక్ట్రానిక్ సిటీ, బేగూర్, వైట్‌ఫీల్డ్, బన్నెరఘట్ట రోడ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. చెత్త సేకరణ, నిర్మాణం, హౌస్‌కీపింగ్ వంటి రంగాల్లో పనిచేస్తున్న వలస కార్మికులను కూడా వెరిఫై చేశారు.
ఎలక్ట్రానిక్ సిటీ డీసీపీ నారాయణ ఎం.(Narayana M.) ప్రకారం.. దాదాపు 3,000 మందిని వెరిఫై చేయగా, సుమారు 105 మందిని పత్రాలు లేని బంగ్లాదేశీయులుగా(Bangladeshis) అనుమానించారు. వారిలో 31 మందిని ఆగస్టు 31న డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన కేసుల్లో ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
యెలనేహళ్లిలో సుమారు 200 మంది బెంగాలీ మాట్లాడే వలస కార్మికులు నివసిస్తున్నారు. అసోంకు చెందిన సంజాబ్ అలీ(Sanjab Ali) మాట్లాడుతూ.. తెల్లవారుజామున పోలీసులు మహిళలు, పిల్లలతో సహా నివాసితులను హుళిమావు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అక్కడ ఉంచారని తెలిపారు.
అసోంలోని బొంగైగావ్ జిల్లాకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రాలు చూపించినా తనను బంగ్లాదేశీయుడిగా అనుమానించారని చెప్పారు. తన జనన ధ్రువీకరణ పత్రం ఇంకా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. సెప్టెంబర్ 3న మళ్లీ స్టేషన్‌కు పిలిచి ఓ అధికారి రెండుసార్లు చెంపదెబ్బ కొట్టారని, ఫోన్ తనిఖీ చేశారని తెలిపారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయలేదని, అసోంలోని తన కుటుంబాన్ని సంప్రదించలేదని ఆరోపించారు.
యెలనేహళ్లి వాసులు గతంలో పోలీసులు నెలనెలా ‘హఫ్తా’ అడిగేవారని, డ్రైవ్ తర్వాత డిమాండ్లు పెరిగాయని ఆరోపించారు. అసోంలోని బర్పేటకు చెందిన నజ్మీనా ఖాతూన్.. తమను తీసుకెళ్లి మధ్యాహ్నం ఆలస్యంగా భోజనం ఇచ్చారని, పిల్లలకు బిస్కెట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జహంగీర్ హుస్సేన్ తన మొబైల్‌ను దాదాపు నెల రోజుల పాటు పోలీసులు ఉంచుకున్నారని ఆరోపించారు.

పోలీసుల ప్రకారం.. వెరిఫికేషన్‌లో కొందరి వద్ద బంగ్లాదేశ్ జాతీయ గుర్తింపు కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లభించాయి. బేగూర్‌లో డిపోర్ట్ చేసిన తొలి 31 మందిలో తొమ్మిది మంది చెత్త సేకరణ, నిర్మాణం, హౌస్‌కీపింగ్ పనులు చేస్తూ షెడ్లలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. కొందరి వద్ద ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ అవి మోసపూరితంగా పొందినవిగా అనుమానిస్తున్నామని చెప్పారు.
అనుమానితులను FRROకి పంపి వేలిముద్రలు, ఫొటోలు, చిరునామాలు, ఆధార్ వివరాలు, బంగ్లాదేశ్ NID కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలను క్రాస్ వెరిఫై చేస్తామని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి జాతీయత నిర్ధారించిన తర్వాత డిపోర్ట్ చేస్తామని డీసీపీ నారాయణ తెలిపారు. కొన్ని కేసుల్లో నిర్ధారణకు సుమారు 20 రోజులు పట్టిందని పోలీసులు చెప్పారు. తొలి విడతలోని 31 మందిని రైలులో మాల్దా వైపు తరలించి, అనంతరం బీఎస్ఎఫ్ సమన్వయంతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు తరలించినట్లు తెలిపారు.
ఆగస్టు 22న ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, పీయూసీఎల్, డొమెస్టిక్ వర్కర్స్ రైట్స్ యూనియన్, AICCTU తదితర సంస్థలు విడుదల చేసిన సంయుక్త నివేదికలో.. కనీసం 10-12 పోలీస్ స్టేషన్ పరిధుల్లోని వలస కార్మికుల నివాస ప్రాంతాలు లక్ష్యంగా మారాయని పేర్కొన్నారు. భారతీయ పత్రాలు ఉన్నప్పటికీ కొందరిని తీసుకెళ్లడం, దాడులు, ఫోన్ తనిఖీలు, పత్రాల విషయంలో భిన్నమైన ప్రమాణాలు పాటించడం వంటి ఆరోపణలను నివేదికలో ప్రస్తావించారు.
బెంగాలీ మాట్లాడటం, వలస కార్మికుడిగా ఉండటం లేదా అనధికారిక నివాసంలో నివసించడం మాత్రమే బంగ్లాదేశీయుడిగా అనుమానించేందుకు ఆధారం కాదని హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఎండీ రహీమ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అసోం తీర్పును ప్రస్తావిస్తూ.. విదేశీయుడిగా అనుమానించేందుకు అధికారుల వద్ద కొంత ఆధారం ఉండాలని, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చర్యలు న్యాయబద్ధమైన విధానంలోనే ఉండాలని తెలిపాయి.
AICCTU న్యాయవాది సుమన్.. అనుమానితులపై విచారణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముందుగా నోటీసు ఇచ్చి పత్రాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలని అన్నారు. బెంగాలీ మాట్లాడే ముస్లిం వలస కార్మికులను, ముఖ్యంగా స్లమ్‌లు, అనధికారిక నివాసాల్లో ఉన్నవారినే ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు కూడా చేశారు.
కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేకు వినతిపత్రం ఇచ్చామని, మానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నామని, ఆర్టీఐల ద్వారా ప్రభుత్వ ఆదేశాలు కోరుతున్నామని, PIL దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నామని న్యాయవాదులు, కార్మిక సంఘాలు తెలిపారు.
ఇక వలస కార్మికుల వాదనలో ఇది కేవలం గుర్తింపు పత్రాల వెరిఫికేషన్ సమస్య కాదు. తమ జాతీయతపై పదేపదే అనుమానాలు, గంటల తరబడి విచారణ, ఫోన్ల తనిఖీలు, పనికి దూరం కావడం, పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తమలో భయాందోళనలు, అవమాన భావన కలిగించాయని వారు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం అక్రమ వలసదారులను గుర్తించేందుకు చట్టబద్ధమైన ప్రక్రియనే అనుసరిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.








