ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్, తక్కువ క్యాలరీలు.. ఈ పదాలు కనిపిస్తే ఆ డ్రింక్ ఆరోగ్యకరమైనదేనన్న భావన కలగొచ్చు. కానీ బీర్‌లో ఇవి కలిపినంత మాత్రాన అది హెల్త్ డ్రింక్‌గా మారదు. ప్రపంచంలోని ప్రముఖ బీర్ కంపెనీల్లో ఒకటైన ఏబీ ఇన్‌బెవ్ ప్రోటీన్, ఎలక్ట్రోలైట్స్‌తో కూడిన బీర్‌లను తీసుకురావడంపై దృష్టి పెడుతోంది. బ్రెజిల్‌లో ఇప్పటికే ప్రోటీన్‌తో కూడిన స్పాటెన్ ప్రోను ప్రవేశపెట్టింది. అయితే ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తుల్లో ప్రోటీన్ లేదా ఎలక్ట్రోలైట్స్ జోడించడం వల్ల ఆల్కహాల్ ప్రభావం మాత్రం మారదు.
ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, కణజాల పునరుద్ధరణకు ఉపయోగపడుతుంది. ఎలక్ట్రోలైట్స్ శరీరంలోని నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో కీలకం. కానీ ఆల్కహాల్ శరీరంపై భిన్నమైన ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆల్కహాల్ 200కు పైగా వ్యాధులు, గాయాలు, ఆరోగ్య సమస్యలతో సంబంధం కలిగి ఉంది. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును కూడా పెంచుతుంది. కాబట్టి బీర్‌లో ప్రోటీన్ ఉందని, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయని చూసి దాన్ని స్పోర్ట్స్ లేదా హెల్త్ డ్రింక్‌గా భావించడం సరైనది కాదు.
అందుకే ఇకపై బీర్ బాటిల్‌పై కనిపించే ‘ప్రోటీన్’, ‘ఎలక్ట్రోలైట్స్’, ‘లో క్యాలరీ’ వంటి పదాల కంటే అసలు లేబుల్‌ను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. అందులో ప్రోటీన్ ఎంత ఉంది? క్యాలరీలు ఎన్ని? ముఖ్యంగా ఆల్కహాల్ శాతం ఎంత? అనేవి చూడాలి. ఆల్కహాల్ ఉన్న పానీయానికి కొన్ని పోషక పదార్థాలు జోడించినంత మాత్రాన అది ఆరోగ్యకరమైన ఎంపికగా మారదు. ముఖ్యంగా ఫిట్‌నెస్ పేరుతో ఇలాంటి ఉత్పత్తులను ఎంచుకునే ముందు వాటి పూర్తి పోషక వివరాలను పరిశీలించడం మంచిది.








