పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా(Financial Security) కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ (Indiramma Family Life Insurance Scheme)నమోదు ప్రక్రియకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను(Official Guidelines) విడుదల చేసింది.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు జీవిత బీమా రక్షణ(Life Insurance Coverage) లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరినీ ఈ పథకంలో చేర్చేందుకు నెల రోజుల పాటు ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు.
ఈ పథకం కింద ఎంపికైన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా(Life Insurance) సౌకర్యం వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి అర్హులు. ఒక రేషన్ కార్డు(Ration Card) ఆధారంగా ఒక కుటుంబానికి చెందిన ఒక్క సభ్యుడికి (ప్రధానంగా కుటుంబ పెద్దకు) మాత్రమే బీమా నమోదుకు అనుమతి ఉంటుంది. ఒక రేషన్ కార్డుపై కేవలం ఒక్క దరఖాస్తును మాత్రమే స్వీకరిస్తారు.
అర్హులైన లబ్ధిదారుల నమోదు కోసం ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నమోదు కోసం లబ్ధిదారుడి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరి. బీమా లబ్ధిదారుడి వివరాలతో పాటు నామినీ వివరాలను కూడా కచ్చితంగా నమోదు చేయాలి. ఒకవేళ నామినీ మైనర్ (18 ఏళ్ల లోపు) అయితే, వారికి సంరక్షకులుగా ఒక మేజర్‌ను (అపాయింటీ) తప్పనిసరిగా పేర్కొనాలి.
నమోదు ప్రక్రియలో(Registration Process) సాంకేతిక లేదా ఇతర చిన్నపాటి సమస్యలు తలెత్తినప్పటికీ, ఏ ఒక్క కుటుంబాన్ని వెనక్కి పంపకూడదని ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే, లబ్ధిదారులకు ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన రసీదును (అక్నాలెడ్జ్మెంట్) అందజేస్తారు.








