ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో జనసేన కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత క్యాడర్ ఆత్మగౌరవం, ప్రాణాల కంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రతిపక్ష వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు, పులివెందులలో జనసేన కార్యకర్త రామాంజనేయులు మృతి వంటి ఘటనలపై పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు పట్ల జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కూటమి పొత్తు ధర్మం పేరుతో స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల పంపకాల్లో జనసేనకు తీవ్ర అన్యాయం జరిగిందని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మగౌరవం చంపుకోలేక పలు చోట్ల జనసేన నేతలు రెబల్స్‌గా పోటీకి దిగితే, నామినేషన్లు కూడా వేయనీయకుండా టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. అయినప్పటికీ, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనీసం స్పందించకుండా మౌనం వహించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పులివెందులలో టీడీపీ నేతల వ్యవహారశైలి కారణంగానే జనసేన కార్యకర్త రామాంజనేయులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సొంత పార్టీ నాయకుడు ప్రాణాలు కోల్పోయినా టీడీపీని ఒక్క మాట కూడా అనకుండా, కనీస నిరసన తెలపకుండా జనసేన అధిష్ఠానం మొక్కుబడిగా ప్రెస్ నోట్ విడుదల చేయడంపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో టీడీపీ దాడులు, అవమానాలు తట్టుకోలేక జనసైనికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని, అయినా, అధినాయకత్వం నుంచి కనీస భరోసా లభించలేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
పార్టీ జెండా మోసిన కార్యకర్తల రక్షణ కంటే పదవులు, చంద్రబాబుతో పొత్తుకే పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగాలని పవన్ కళ్యాణ్ చెబుతున్న నేపథ్యంలో, ఇదే విధంగా టీడీపీ కోసం సైలెంట్‌గా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెంత మంది జనసైనికుల ప్రాణాలు పోతాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.








