ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెలిగొండ ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రాజెక్టు క్రెడిట్‌ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకోవడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందో లెక్కలతో సహా వివరిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను వక్రీకరిస్తూ క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వెలిగొండ ప్రాజెక్టు తన తండ్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమని జగన్ పేర్కొన్నారు. ఆ మహాయజ్ఞంలో తాను కూడా భాగస్వామి కావడం, తన ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తి చేసి జాతికి అంకితం చేయడం, ప్రస్తుతం వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని తెలిపారు. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ప్రాజెక్టు సంజీవని వంటిదని జగన్ పేర్కొన్నారు.
అయితే వెలిగొండ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. కొన్ని రోజులుగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలేనని విమర్శించారు. శిలాఫలకం మాత్రమే చంద్రబాబుది అని, ప్రాజెక్టుకు సంకల్పం, సమగ్ర రూపం ఇచ్చింది వైఎస్సార్ అని పేర్కొన్నారు. కీలకమైన జంట సొరంగాలను పూర్తి చేసింది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
1996లో ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన రాయి వేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత 2004 వరకు ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ప్రాజెక్టును ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఆ ఎనిమిదేళ్లలో కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని, అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే అని పేర్కొన్నారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సమగ్ర రూపం ఇచ్చారని జగన్ తెలిపారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టుకు 37.587 కిలోమీటర్ల పొడవైన జంట సొరంగాలే ప్రాణమని జగన్ పేర్కొన్నారు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావని అన్నారు. వైఎస్సార్ ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్ల సొరంగాల పనులు పూర్తయ్యాయని చెప్పారు.
2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం 6.686 కిలోమీటర్ల మేర మాత్రమే సొరంగాల పనులు జరిగాయని జగన్ ఆరోపించారు. ఒక్క సొరంగానికి కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారని విమర్శించారు.
కరోనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ ప్రభుత్వ హయాంలో మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల సొరంగ తవ్వకాలను పూర్తి చేశామని జగన్ తెలిపారు. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తి చేశామని చెప్పారు. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశామని తెలిపారు. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గాన్ని కూడా తమ ప్రభుత్వమే సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
‘మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?’ అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను తీసుకోవాలనుకోవడం చంద్రబాబు సహజ నైజానికి మరో నిదర్శనమని విమర్శించారు.
వెలిగొండతో పాటు ప్రకాశం ప్రాంత అభివృద్ధి విషయంలో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ పలు ప్రశ్నలు సంధించారు. తమ ప్రభుత్వం పెద్దదోర్నాలలో చేపట్టిన 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారని నిలదీశారు.
జంట సొరంగాలను తమ ప్రభుత్వం 2024లోనే సిద్ధం చేసినప్పటికీ.. ఆ తర్వాత 26 నెలల పాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తి చేయలేదని జగన్ ప్రశ్నించారు. నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదని నిలదీశారు. రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదని ఆరోపించారు.
వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు ఇంకా రాలేదని, అయినా బలవంతంగా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని, తమ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని, తాగునీటి సరఫరాను కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జగన్ తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టుపై ప్రచార ఆర్భాటాన్ని పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. నల్లమలసాగర్‌ను నింపాలని, రైతులకు సాగునీరు అందించాలని, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని డిమాండ్ చేశారు.
నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక… pic.twitter.com/nDineOXzWb
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2026








