అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం జనసేన కేడర్లో తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి కారణమవుతోంది. గత రెండ్రోజులుగా స్థానిక ఎన్నికల్లో జనసేనకు 40 శాతం పదవులు దక్కుతాయని గంపెడాశతో ఉన్న ఆ పార్టీ శ్రేణులకు.. చంద్రబాబుతో చర్చల తర్వాత పరిణామాలు చూశాక అసలు నిజం అర్థమైంది. ఈ హడావుడి కేవలం జనసైనికులను మభ్యపెట్టడానికేనా అనే అనుమానాలు ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
కూటమి పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై స్పష్టత రాకముందే, జనసేన కోరుకుంటున్న కీలకమైన మేయర్ స్థానాల కోసం టీడీపీ నాయకులు జనసేనలో చేరుతున్నారు.
విజయవాడ కార్పొరేషన్ మేయర్ సీటు కోసం వంగవీటి రాధాకృష్ణను టీడీపీ వ్యూహాత్మకంగా జనసేన పార్టీలోకి పంపించారనే చర్చ జోరుగా సాగుతోంది. అదే విధంగా తిరుపతికి చెందిన టీడీపీ నేత ప్రణీత్ పెనుమాదు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. తిరుపతి మేయర్ పీఠంపై ప్రణీత్ కన్నేశారు.
“బలం ఉన్న ప్రతిచోటా పోటీ చేస్తాం, జనసేన సత్తా చాటుతాం” అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు, ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన కుదరడం లేదని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.
సీటు జనసేనకు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ.. చివరికి అక్కడ పోటీ చేసేది మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన నాయకులే కావడం గమనార్హం. జనసేనకు కేటాయించే అరకొర సీట్లలో కూడా టీడీపీ నాయకులను పంపి పోటీ చేయిస్తే, ఇక పార్టీ కోసం కష్టపడి జెండాలు మోసే క్షేత్రస్థాయి జనసైనికుల పరిస్థితి ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.
“అంతమాత్రం దానికి చంద్రబాబుతో సీట్ల కోసం చర్చలు జరపడం ఎందుకు? జనసేన పార్టీని టీడీపీకి డెవలప్మెంట్ ఫ్రంట్లా మార్చడానికి పవన్ అంగీకరించారా?” అంటూ నెటిజన్లు, జనసేన కార్యకర్తలు తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల వేళ కూటమిలో జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం.. జనసేనలోని అసలు సిసలైన నాయకులను, కార్యకర్తలను తీవ్ర దగా చేసేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








