నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన సేవా కార్యక్రమంతో వార్తల్లో నిలిచారు. విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ‘రణబాలి’ సినిమాలోని జయమ్మ పాత్ర స్ఫూర్తితో ‘అన్నపూర్ణ’ పేరుతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఎనిమిది ప్రాంతాలకు చెందిన 400 పేద కుటుంబాలకు ఆమె అండగా నిలిచారు. ఆయా కుటుంబాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అంతేకాకుండా, ఏడాది పాటు ప్రతి మూడు నెలలకోసారి ఈ సాయాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.
తన సేవా కార్యక్రమాల గురించి రష్మిక మాట్లాడుతూ.. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా చాలాకాలంగా ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, అయితే ప్రచారం కోసం వాటిని వెల్లడించలేదని తెలిపారు. తన చర్యల ద్వారా మరికొందరికైనా స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని పంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.
400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడం వల్ల వారు ఆ ఖర్చును ఆదా చేసుకుని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో రష్మిక చేపట్టిన ఈ కార్యక్రమం సినీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.








