పవన్ కళ్యాణ్ చెప్పినా వారికి ఓటు వేయొద్దు

పవన్ కళ్యాణ్ చెప్పినా వారికి ఓటు వేయొద్దు

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావం మోగిన వేళ, అధికార కూటమికి సొంత పార్టీ నుంచి, అలాగే గతంలో పార్టీలో కీలక నేతలుగా ఉన్నవారి నుంచి సెగ తగులుతోంది. తాజాగా జ‌న‌సేన మాజీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినా సరే.. విశాఖ విధ్వంసానికి పాల్పడే కూటమి నేతలకు, చెడ్డవారికి స్థానిక ఎన్నికల్లో ఓటు వేయొద్దంటూ ఆయన ఓటర్లకు పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

జనసేన పార్టీని వీడిన నాటి నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ శాఖ‌ను టార్గెట్ చేసి.. గళం విప్పుతున్న బొల్లిశెట్టి సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాలను ఆయన ఎండగడుతున్నారు.

విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో పర్యావరణాన్ని, ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన సింహాచలం కొండపై చెట్లను పెద్ద ఎత్తున నరికివేయడం, ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలకు పాల్పడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల‌ తరుణంలో జీవీఎంసీ పరిధిలోని ఓటర్లను ఉద్దేశించి బొల్లిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “డేటా సెంటర్‌కు, విశాఖ విధ్వంసానికి మద్దతు ఇస్తున్న ఏ పార్టీకి కూడా ఓటు వేయవద్దు” అని ఆయన స్పష్టం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజల భవిష్యత్తుకు ఎంతో కీలకమని.. “ఒకవేళ పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినా సరే.. తప్పు చేసేవారికి, చెడ్డవారికి ఓటు వేయకండి” అంటూ సంచలన ప్రకటన చేశారు. విశాఖను, స్థానిక వనరులను కాపాడే మంచి నాయకులను మాత్రమే ప్రజలు స్వయంగా ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలపై, స్వయంగా సొంత పార్టీ నేపథ్యం ఉన్న నేతలే ఇలా బహిరంగంగా వ్యతిరేక గళం వినిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment