న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ‘సర్’ను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో రాహుల్ గాంధీ పాదయాత్రగా సుప్రీంకోర్టు ప్రాంగణం వరకు రావడంపై సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో రాజకీయ ఊరేగింపులు నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ.. తాము వాస్తవ ప్రపంచానికి అతీతులం కాదని, అన్ని విషయాలూ తెలుసని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన అంశం కూడా విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోలేదని, ఒక కమిటీ సూచన మేరకు చర్యలు చేపట్టినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు.
జంతర్ మంతర్ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందుగా ప్రభుత్వం ఇచ్చే వివరణను పరిశీలిస్తామని, దానితో సంతృప్తి చెందకపోతే చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొంది.








