అధికారం శాశ్వతం కాదు… కానీ రాజకీయాల్లో (Politics) తీసుకునే కొన్ని అనాలోచిత నిర్ణయాలు, సాగించే దాడులు భవిష్యత్ తరాల పాలిట శాపాలుగా మారుతాయి. సరిగ్గా ఇదే ఇప్పుడు అమరావతి (Amaravati) ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా (Social Media), పౌర సమాజంలో వ్యక్తమవుతున్న అతిపెద్ద ఆందోళన. రెండో విడత భూసేకరణకు తమ వారసత్వ ధరణీ సంపదను ఇవ్వబోమని కొందరు రైతులు (Farmers) ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. మాజీ సీఎం (Former Chief Minister) వైఎస్ జగన్‌ను (YS Jagan Mohan Reddy) కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అండగా ఉంటామన్న జగన్ హామీ మేరకు రైతులకు మద్దతుగా జరిగే పరిణామాలను తెలుసుకునేందుకు వైసీపీ (YSR Congress Party) నాయకులు పెనుమాకకు (Penumaka) బయల్దేరారు.
ఉండవల్లిలోనే వారిపై తెలుగుదేశం పార్టీ(TDP) శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడటం తీవ్ర సంచలనంగా మారింది. చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసుల (Police) అండ చూసుకుని ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం తాత్కాలికంగా పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ, ఈ దాడి వెనుక ఉన్న ‘రాజకీయ అహంకారం’ రేపు అమరావతి భవిష్యత్తును (Amaravati Future) ఏ తీరానికి చేరుస్తుందనేది ఇక్కడ అసలు ప్రశ్న.
ప్రస్తుతం రాజధాని(Capital) ప్రాంతంలోకి వైసీపీని(YSRCP) అడుగు పెట్టనివ్వబోమంటూ టీడీపీ(TDP) నేతలు, కార్యకర్తలు సవాళ్లు విసురుతున్నారు. అయితే, ప్రజాస్వామ్యంలో (Democracy) ఏదీ శాశ్వతం కాదు. రేపు పొరపాటున భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు మారి, అధికారం మారితే… మళ్లీ అమరావతిని అభివృద్ధి చేయాలని వైసీపీని(YSRCP) డిమాండ్ చేసే నైతిక హక్కు ఇక్కడి రైతులకు ఉంటుందా, ఉండదా? అని ఒక్కసారి అమరావతి ప్రాంత రైతులు(Farmers) ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రైతులు ఎక్కడైనా ఒక పార్టీ రాజకీయ ఎజెండాను భుజాన మోస్తారా?, నాగలితో భూమిని చీల్చే ముందు దయుంచు తల్లి అని భూదేవిని వేడుకునే రైతులు ఇలా రాళ్లతో దాడి చేసేంత క్రూరత్వానికి తెగబడతారా..? అమరావతి రైతుల పేరుతో తెరవెనుక నాటకాన్ని రక్తి కట్టిస్తున్నది ఎవరో, ఆ నడిపిస్తున్న సూత్రధారులు ఎవరో ప్రజలందరికీ బాగా తెలుసు. దాడుల ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించి సాధించేదేమీ లేదు. ఈ రోజు వైసీపీ నేతలపై జరిగిన దాడి, భవిష్యత్తులో రాజధాని మనుగడకే శరాఘాతంగా మారుతుందనే కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లో వెల్లువెత్తుతున్నాయి.
అమరావతికి ఎవరూ రాకూడదు.. కానీ దాని అభివృద్ధికి మాత్రం అందరి సొమ్ము ఖర్చు పెట్టాలా? అనే ప్రజాస్వామ్య ప్రశ్నను పాలకులు ఎలా ఎదుర్కొంటారు? గత ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రంలోని 40 శాతం ప్రజలు మద్దతుగా నిలిచారు. అంటే 1.5 కోట్ల మంది. వారందరి తరఫున అక్కడ ఏం జరుగుతుందో అడిగే హక్కు వాళ్లకు ఉన్నట్టే అని ప్రభుత్వ పెద్దలు భావిస్తే సరిపోయేది కదా.. ఇప్పుడా 40 శాతం మంది ఓటర్లు అమరావతి వ్యతిరేకులేనా..? అంటే కోటిన్నర మంది ప్రజలకు కూటమి (Alliance Government) చెబుతున్న ప్రజారాజధానితో సంబంధం లేనట్టేనా..? మరి వారు కట్టే పన్నులు, షూరిటీగా ప్రభుత్వం తెచ్చే అప్పులకు వారిని భాగస్వామ్యం చేయడం ఎందుకు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. ఈ రెండేళ్ల కూటమి పాలన తీరు చూస్తుంటే, మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ప్రస్తుత పాలకుల్లోనే సన్నగిల్లినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సొంత పార్టీల నుంచే పెదవి విరుపులు మొదలయ్యాయి. అందుకే ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులే భవిష్యత్తును ఊహించి చాలా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే… రేపు ప్రభుత్వం మారితే తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని గ్రహించి, “మనకెందుకులే” అంటూ తటస్థ ధోరణి అవలంబించడానికి సిద్ధపడుతున్నారు.
ఇలాంటి పరిణామాల మధ్య… భూములు ఇవ్వబోమని చెబుతున్న పెనుమాక(Penumaka), ఉండవల్లి (Undavalli) ప్రాంత రైతులకు అండగా నిలిచేందుకు వైసీపీ నేతలు వెళ్తుంటే, అధికార పక్షానికి ఎందుకు అంత కడుపుమంట? ఉండవల్లిలో వైసీపీ నేతలపై చేసిన ఈ దాడికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ రాజకీయ పోరాటంలో అంతిమంగా నష్టపోయేది అమరావతి రైతులు కాదా?
అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. రాజధాని ప్రాంతంలో ఏ మేరకు అభివృద్ధి చేశారో ప్రజలకు చూపించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. చేతిలో కేవలం మరో మూడేళ్ల అధికారం మాత్రమే మిగిలి ఉంది. ఈ పరిమిత కాలంలో రాజధానికి ఏదైనా మంచి మౌలిక వసతులు కల్పించడంపై, అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. అంతేగానీ, రాజధాని ప్రాంతం కేవలం ఒక వర్గానికో లేదా ఒక పార్టీకో సొంతమన్నట్టు ప్రవర్తిస్తూ… గిట్టని వాళ్లు వస్తే దాడులు చేస్తామనడం అప్రజాస్వామికం.
ఇప్పటికైనా పాలకులకు కళ్లు తెరిచి, ఇలాంటి రెచ్చగొట్టే పనులకు, అక్రమ కేసుల బనాయింపులకు స్వస్తి పలికి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై, మంచి పరిపాలనపై దృష్టి సారించాలని పౌర సమాజం గట్టిగా కోరుకుంటోంది.








