పోలీసుల వాహనంలో గంజాయి.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్‌

పోలీసుల వాహనంలో గంజాయి.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్‌

Summarize with AI

రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన అద్దంకి సమీపంలో ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారులో గంజాయి లభించిన ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘హే రామ్‌..’’ అంటూ ట్వీట్‌ చేసిన జగన్‌.. రాష్ట్రంలో చంద్ర‌బాబు ప్రభుత్వం, పాలన ఏ స్థాయిలో కుప్పకూలిందో ఈ ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. ‘‘చంద్రబాబూ.. అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’’ అంటూ ప్రశ్నించారు.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే అక్రమాలు చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అని జగన్ ప్రశ్నించారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంలోనే అవినీతి చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరప్పాడు వద్ద జరిగిన ఘటనను ఏదో ఒక సంఘటనగా కొట్టిపారేయలేమని జగన్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా వ్యవస్థలను ప్రజల కోసం కాకుండా రాజకీయ కక్షసాధింపులకు, ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి, ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలుకు ఉపయోగించారని చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్షన్ల కోసం వ్యవస్థలను ఉపయోగించుకున్న ఫలితమే ప్రస్తుత పరిస్థితని విమర్శించారు. వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాలకు, కలెక్షన్లకు ఉపయోగిస్తే చివరకు అవి ఎంతగా భ్రష్టుపడతాయో అద్దంకి ఘటన కళ్లకు కడుతోందని వ్యాఖ్యానించారు.

అద్దంకి ఘటనను ప్రస్తావించిన జగన్.. ఇద్దరు ఎస్సైలు ప్రయాణిస్తున్న కారును మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ నడిపాడని, ఆ కారు ఆటోను ఢీకొనడంతో అందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ప్రమాదం తర్వాత స్థానికులు కారును చుట్టుముట్టగా.. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎస్సైలు కూడా మత్తులో ఉన్నట్లు ఆరోపించారు.

అంతేకాకుండా కారు డిక్కీలో గంజాయి, మద్యం, పోలీస్‌ యూనిఫాం కనిపించాయని జగన్ పేర్కొన్నారు. అక్కడున్న ప్రజలు ఘటనను వీడియో తీసి వాస్తవాలను బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే.. ఘటనా స్థలానికి వచ్చిన మరో సీఐ ‘‘వీడియోలు తీయొద్దు.. కేసులు పెడతాం’’ అంటూ బెదిరించారని ఆరోపించారు. ‘‘నిజాన్ని బయటపెట్టడమే నేరమా? ప్రశ్నించడమే తప్పా?’’ అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇద్దరు పోలీసు అధికారులు ప్రైవేట్ పార్టీలు నిర్వహించారని, అక్కడ మద్యం, గంజాయి వినియోగించారని, ఆ పార్టీల్లో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారన్న సమాచారం మరింత దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు.

ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను స్థానిక టీడీపీ నాయకులు తప్పించారన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని అన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థతో అధికార పార్టీ నాయకుల కుమ్మక్కు ఎంత లోతుకు వెళ్లిందో ఈ ఘటన బయటపెడుతోందని జగన్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లలో కేసుల నమోదు నుంచి దర్యాప్తు వరకు నిష్పక్షపాతంగా జరుగుతుందని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.

చంద్రబాబు రోజూ గంటలకొద్దీ నీతి కబుర్లు చెబుతూ.. మరోవైపు రాజకీయ కుట్రలు, కక్షసాధింపులతో వ్యవస్థలను విషపూరితం చేస్తున్నారని జగన్ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడంపై చూపిస్తున్న శ్రద్ధలో కనీసం కొంతైనా శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ ప్రక్షాళనపై పెట్టాలని సూచించారు.

అద్దంకి ఘటనను మీడియా బలంతో కప్పిపుచ్చే ప్రయత్నం చేయవద్దని, అంశాన్ని డైవర్ట్ చేయకుండా నిష్పక్షపాత విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనను ప్రశ్నించిన స్థానికులపై ‘రెడ్‌బుక్‌’ ప్రయోగించకుండా, వీడియోలు తీసిన వారిని వేధించకుండా నిజాయితీగా వ్యవహరించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment