కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్‌ వ్యవహారం

కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్‌ వ్యవహారం

Summarize with AI

తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటుండటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా పార్టీ నిర్ణయాలపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చకు దారితీస్తోంది.

మూడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలకు రాజగోపాల్ రెడ్డి హాజరు కావడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల్లోనూ ఒకటి, అరా సందర్భాలు మినహా ఆయన కనిపించడం లేదని నేతలు పేర్కొంటున్నారు.

ఇవాళ భువనగిరిలో మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నిర్వహించిన పీఏసీ సమావేశానికి (PAC Meeting) కూడా రాజగోపాల్ రెడ్డి హాజరుకాలేదు. పార్టీలోని నేతల మధ్య సఖ్యత పెంచడం, అసంతృప్తులను తొలగించడం, అంతర్గత అంశాలపై చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశంగా ఉండగా.. కీలక నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం చర్చకు దారితీసింది.

ఇటీవల కాలంలో పార్టీ నిర్ణయాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఆయన మూడేళ్లుగా ఆగ్రహంగా ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానంటూ ఆయన చేసిన ప్రకటన కూడా కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది.

రాజగోపాల్ రెడ్డి వరుస వ్యాఖ్యలపై ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కూడా స్పందించారు. పార్టీ నిర్ణయాలకు, పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పీఏసీ సమావేశానికి కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? బహిరంగంగా వ్యక్తమవుతున్న అసంతృప్తికి ఎలా ముగింపు పలుకుతుంది? అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment