రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, కూటమి ప్రభుత్వానికి పాలనపై కంటే ప్రచార ఆర్భాటాలపైనే శ్రద్ధ ఎక్కువైందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై, పోలీసుల వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ప్రభుత్వ పెద్దలకు మేకప్ మీద ఉన్న శ్రద్ధ.. పోలీస్ లాకప్‌లలో జరుగుతున్న ఘోరమైన నేరాలపై లేదు” అంటూ కన్నబాబు ఎద్దేవా చేశారు. మేకప్ గురించి మాట్లాడారంటూ వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌కు తక్షణమే నోటీసులు జారీ చేసిన మహిళా కమిషన్, రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న లాకప్ డెత్‌లకు బాధ్యులైన విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. చట్టాలు, నోటీసులు కేవలం ప్రతిపక్షాలకేనా అని నిలదీశారు.
విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో లాకప్ డెత్ బాధితుడు సాయికృష్ణ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. తన కొడుకు ఆచూకీ కోసం తల్లి గాదె విజయలక్ష్మి ఎన్నిసార్లు వేడుకున్నా అధికారుల మనసు కరగకపోవడం దారుణమన్నారు. “ఈ కేసులో సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు పెట్టారంటేనే.. సాయికృష్ణను పోలీసులే చంపేశారని ప్రభుత్వం పరోక్షంగా అంగీకరించినట్టే కదా?” అని కన్నబాబు ప్రశ్నించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం.. స్టేషన్‌కు వచ్చే బాధితులపై బూతులతో విరుచుకుపడే సంస్కృతిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వైఎస్ జగన్ స్పందించి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్ప పాలకుల్లో చలనం రావడం లేదని కన్నబాబు విమర్శించారు. ప్రతిపక్షం నిలదీసే వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.
ఆక్వా రంగంపై ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను కన్నబాబు బయటపెట్టారు. ఫీడ్ రేటును ఏకంగా 14 రూపాయలు పెంచేసి, ఇప్పుడు కేవలం 4 రూపాయలు తగ్గించి.. తామేదో ఆక్వా రైతులను ఉద్ధరించినట్లు డ్రామాలు ఆడుతున్నారని, ఇది రైతులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.








