ఏపీ మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

ఏపీ మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక వార్త తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఓ మంత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సామాజిక కార్యకర్త, ‘ప్యూర్’ (PURE) సేవా సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ షైలా తల్లూరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు మంత్రి పేరును ప్రత్యక్షంగా వెల్లడించనప్పటికీ, ఆయన ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలు, వాట్సాప్ సంభాషణలు (చాట్ హిస్టరీ), స్క్రీన్‌షాట్లు తన వద్ద భద్రంగా ఉన్నాయని షైలా తల్లూరి తెలిపారు.

“లోకేష్ గారూ.. మీ మంత్రివర్గంలోని ఒక మంత్రి అసభ్య ప్రవర్తనకు సంబంధించి నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. నిజానిజాలు తెలుసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే నన్ను సంప్రదించండి. దీనిపై పారదర్శకమైన విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి” అని ఆమె ఫేస్ బుక్ లో పేర్కొన్నారు.

సదరు మంత్రి తనకు పదేపదే అసభ్యకరమైన మెసేజ్‌లు, ఫోటోలు పంపుతూ అపాయింట్‌మెంట్ కోసం ఒత్తిడి తెచ్చారని షైలా తల్లూరి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుపేద పిల్లల సంక్షేమం కోసం తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే మొదట్లో ఈ వ్యవహారాన్ని ఉపేక్షించినట్లు ఆమె తెలిపారు.

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు బాధితులకు సానుభూతి తెలపాల్సింది పోయి, “ఇంతకాలం ఎందుకు చెప్పలేదు?” అని తిరిగి ప్రశ్నించే ధోరణిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇటువంటి కేసుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించారు.

తన వద్ద ఉన్న ఆధారాలను విచారణాధికారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపితే బాధితులకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. అలాగే, సదరు మంత్రి నుంచి ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్న ఇతర మహిళలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరారు.

ప్రస్తుతం ఈ ఆరోపణలు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై సదరు మంత్రి పేరును గానీ, ఆయనకు సంబంధించిన ఆధారాలను గానీ షైలా తల్లూరి ఇప్పటివరకు బహిరంగంగా విడుదల చేయలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, సంబంధిత వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment