కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొనడం మొదలైన రాజకీయ చర్చ ఇప్పుడు టీడీపీలోనే వివాదంగా మారుతోంది. వైసీపీ నేత అంబటి రాంబాబుతో బోండా ఉమా ఆత్మీయంగా మాట్లాడటం, అదే వేదికపై కాపుల ఆకాంక్షల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ మరుసటి రోజే వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దంటూ సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించినట్లు వార్తలు రావడంతో వ్యవహారం మరింత వేడెక్కింది.
ఈ నేపథ్యంలో బోండా ఉమా తీరుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్‌గా ఉందని, ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చిందనే ప్రచారం కూడా జోరందుకుంది. మరోవైపు టీడీపీ నేతల నుంచే బోండా వ్యాఖ్యలకు కౌంటర్లు, ఆ పార్టీ అనుకూల మీడియాలోనూ ఆయన వ్యాఖ్యలపై విమర్శనాత్మక ప్రసారాలు రావడంతో ఈ వివాదం బోండా ఉమా వర్సెస్ టీడీపీగా మరింత ముదిరిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వారిని కూడా పార్టీ వివరణ అడుగుతుందా..? – బోండా ఉమా
ఈ ప్రచారంపై స్పందించిన బోండా ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు పార్టీ అధిష్ఠానం తనను ఎలాంటి వివరణ అడగలేదని, ఒకవేళ కోరితే తప్పకుండా సమాధానం ఇస్తానన్నారు. తాను వైసీపీ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని చెప్పారు. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని వివరణ ఇచ్చారు.
ఇదే సమయంలో బోండా మరో ప్రశ్నను తెరపైకి తెచ్చారు. వైసీపీ నేత జక్కంపూడి నిర్వహించిన ముద్రగడ సంతాప కార్యక్రమానికి జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని, మరి వారిని కూడా పార్టీ వివరణ అడుగుతుందా? అని ప్రశ్నించారు. తాను పార్టీకి ఇబ్బంది కలిగించే ఎలాంటి పని చేయలేదని స్పష్టం చేసిన బోండా ఉమా.. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. పార్టీలకు అతీతంగా కాపులు ఏకమవుతారని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ఆసక్తి రేపుతున్నాయి.
బోండాకు వర్మ కౌంటర్
బోండా ఉమా వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. బోండా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదని చెబుతూనే.. టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. దీంతో బోండా వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచే భిన్నస్వరాలు వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.
కాపులు కలిస్తే చంద్రబాబుకు కడుపుమంట.. – అంబటి
మరోవైపు ఈ వివాదంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఒక విషాదకర సందర్భాన్ని కూడా రాజకీయ వివాదంగా మార్చుతున్నారని విమర్శించారు. ముద్రగడ సంతాప సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని, తనతో బోండా ఉమా ఒకే వేదికపై కనిపించడాన్ని కూడా ముఖ్యమంత్రి తప్పుపడుతున్నారని ఆరోపించారు.
కాపు సామాజికవర్గంలో అలజడి మొదలైందని స్వయంగా బోండా ఉమానే చెప్పారని అంబటి గుర్తుచేశారు. “కాపులు కలిస్తే చంద్రబాబుకు కడుపుమంట” అంటూ అంబటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ తర్వాత కాపు సామాజికవర్గానికి పెద్దన్నగా ఎవరు ఉంటారనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. కాపు సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష కూడా బలంగా ఉందని వ్యాఖ్యానించారు.
టీడీపీలో అంతర్గత చర్చ..
ముద్రగడ పద్మనాభం సంతాప సభగా మొదలైన పరిణామం ఇప్పుడు టీడీపీలో రాజకీయ చర్చకు దారితీసింది. అంబటిని మర్యాదపూర్వకంగానే పలకరించానని బోండా చెబుతుండగా.. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయొద్దని సొంత పార్టీ నేతల నుంచే సూచనలు వస్తున్నాయి.
మరోవైపు “పార్టీలకతీతంగా కాపులు ఏకమవుతారు” అంటూ బోండా చేసిన వ్యాఖ్యలు, “కాపుల్లో సీఎం కావాలనే ఆకాంక్ష ఉంది” అంటూ అంబటి చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం కేవలం ఒక సంతాప సభలో జరిగిన పలకరింపులకే పరిమితం కాకుండా కాపు రాజకీయాల వైపు మళ్లుతోంది. బోండా ఉమాను టీడీపీ అధిష్ఠానం అధికారికంగా వివరణ కోరుతుందా? ఆయన చెప్పినట్లుగా ఇతర టీడీపీ నేతల విషయంలోనూ ఇదే వైఖరి అనుసరిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








