అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

అంబటితో బోండా ముచ్చట.. టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!

Summarize with AI

రెండు రాజ‌కీయ పార్టీల నాయ‌కులు స‌న్నిహితంగా ఉండ‌కూడ‌దా..? ఎప్పుడూ ఎడ‌మొహం, పెడ‌మొహంగానే ఉండాలా..? ఒక కార్య‌క్ర‌మానికి హాజ‌రైతే క‌నీసం క‌ర‌చాల‌నం చేసుకొని కూడా ప‌ల‌క‌రించుకోవ‌ద్దా..? తాజాగా టీడీపీ శ్రేణుల‌కు చంద్ర‌బాబు ఇచ్చిన ఆదేశాలు అలాగే ఉన్నాయంటున్నారు రాజ‌కీయ నాయ‌కులు.

నిన్న గుంటూరు వేదిక‌గా జ‌రిగిన కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సంతాప స‌భను కాపు సామాజిక వ‌ర్గ జేఏసీ నిర్వ‌హించింది. ఈ స‌మావేశానికి రాజ‌కీయ ప్ర‌ముఖులు, కాపు సామాజిక వ‌ర్గ పెద్ద‌లు, ముద్ర‌గ‌డ స‌న్నిహితులు హాజ‌రై.. వారి అనుభ‌వాల‌ను వేదిక నుంచి పంచుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా హాజ‌ర‌య్యారు. సంతాప సభలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఆత్మీయంగా పలకరించుకోవడం, పక్కపక్కనే కూర్చొని చాలాసేపు ముచ్చటించి స‌న్నిహితంగా మెలిగారు. అనంత‌రం బోండా ఉమా చేసిన వ్యాఖ్య‌లు కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. వైసీపీ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరించుకోవడం, ఇద్దరూ మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముద్రగడ సంతాప సభలో మాట్లాడిన బోండా ఉమా.. కాపు సామాజికవర్గంలో అలజడి మొదలైందని, వారి ఆక్రందనలను ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా కాపుల మద్దతు తప్పనిసరని స్పష్టం చేశారు. 2019లో టీడీపీ అధికారాన్ని కోల్పోవడానికి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఉద్యమం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని బోండా ఉమా పేర్కొన్నారు. ప్రస్తుతం కాపుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దు.. – చంద్ర‌బాబు
ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రతిపక్ష నేతలతో వేదికలు పంచుకునే అంశం ప్రస్తావనకు రావడం రాజకీయంగా చర్చకు దారితీసింది. వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికలు పంచుకోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేసినట్లు టీడీపీ మీడియా ప్ర‌సారం చేసింది.

ఆ పార్టీ నేతలతో సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వైసీపీ రాజకీయ వ్యూహాల ట్రాప్‌లో పడొద్దని సూచించినట్లు టీడీపీ మీడియా వెల్ల‌డించింది. అయితే.. ఈ వ్యాఖ్యలు బోండా ఉమాను ఉద్దేశించే చేశారా? అనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో మొదలైంది. ఇక్కడే మరో చర్చ తెరపైకి వస్తోంది. రాజకీయంగా ప్రత్యర్థులైనంత మాత్రాన వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం, సామాజిక, సంతాప కార్యక్రమాల్లో ఒకే వేదికపై కనిపించడం తప్పా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా రాజకీయాల్లో “ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆ తర్వాత ప్రజల కోసం కలిసి పనిచేయాలి” అని నేతలు చెబుతుంటారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో తీవ్రంగా విమర్శించుకునే నాయకులు కూడా వ్యక్తిగత సందర్భాల్లో ఆత్మీయంగా పలకరించుకోవడం దేశ‌ రాజకీయాల్లో కొత్తేమీ కాదు.

ప్రత్యర్థి పార్టీ నాయకుడితో ఒకే వేదికపై కనిపించడాన్ని కూడా పార్టీ క్రమశిక్షణ కోణంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందా? అనే ప్రశ్నలు తాజా పరిణామాలతో తెరపైకి వస్తున్నాయి. గ‌తంలో మంత్రి పార్ధ‌సార‌ధి గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో వైసీపీ నేత‌ల‌తో వేదిక పంచుకోవ‌డాన్ని కూడా టీడీపీ త‌ప్పుబ‌ట్టి.. వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరిన విష‌యం తెలిసిందే.

దేశ రాజ‌కీయాల కంటే భిన్నంగా ఏపీలో రాజ‌కీయం మాత్రం శ‌త్రుత్వంగా మారుతోందన్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌తిప‌క్ష రాజ‌కీయ పార్టీల‌త నేత‌ల‌తో, సొంత సామాజిక వ‌ర్గ పెద్ద‌ల‌తో నేత‌ల‌తో స‌న్నిహితంగా ఉండ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment