లోకేష్ రాజీనామా డిమాండ్.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరాటం

లోకేష్ రాజీనామా డిమాండ్.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరాటం

Summarize with AI

ఇటీవ‌ల ఢిల్లీని ర‌గిల్చిన యువ‌త ఆగ్ర‌హం.. తాజాగా ఏపీని తాకింది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఉద్య‌మంతో ఏకంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్ష వైసీపీ పోరాటాన్ని ఉధృతం చేసింది. డీఎస్సీ అభ్యర్థులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. డీఎస్సీ పేపర్ లీక్, పోస్టుల విక్రయం, నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

వైసీపీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో యువజన, విద్యార్థి విభాగాలు భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. డీఎస్సీ నియామక ప్రక్రియ స్కాం, దగా, మోసం అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించాయి.

డీఎస్సీ పేపర్ లీక్ ఆరోపణలు, పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం, నిరుద్యోగ భృతి అమలు చేయాలని కూడా నిరసనకారులు కోరారు.

డీఎస్సీ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అభ్యర్థులు గత కొంతకాలంగా వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని పలువురు డీఎస్సీ అభ్యర్థులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఆ సమయంలో అభ్యర్థుల న్యాయపోరాటానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వైసీపీ నాయకులు తెలిపారు.

ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువత చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీలో కూడా డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. డీఎస్సీ నియామక ప్రక్రియపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, అభ్యర్థులకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment