కొడుకు కోసం పోరాటం చేసిన ఆ తల్లి ఇక లేదు..

కొడుకు కోసం పోరాటం చేసిన ఆ తల్లి ఇక లేదు..

Summarize with AI

కొడుకు మృతిపై(Son’s Death) న్యాయం కోసం ఆరు నెలలుగా అలుపెరగని పోరాటం చేసిన ఓ తల్లి ఇక లేదు. తన బిడ్డకు ఏం జరిగిందో తేల్చాలని, తన కొడుకుకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగిన మౌలాబీ (Moulabi) చివరకు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో(Singarayakonda) చోటుచేసుకుంది.

సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో(Sri Chaitanya Navodaya Coaching Centre) సుమారు ఆరు నెలల క్రితం ఆరో తరగతి విద్యార్థి (Student) సయ్యద్ తౌషిక్(Syed Touseef) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ కుమారుడిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అంటూ.. 5 నిమిషాల ముందు నవ్వుతూ మాట్లాడిన అబ్బాయిని చంపేసారంటున్నా తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కొడుకు మరణానికి కారకులకు శిక్ష పడడమే తౌషిక్ తల్లి మౌలాబీకి లక్ష్యంగా మారింది.

తన కొడుకు మరణానికి కారణమైన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏపీ అసెంబ్లీ (AP Assembly) వద్ద మార్చి 5వ తేదీన ఆందోళన సైతం చేప‌ట్టింది. అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు. ప్లీజ్ అండీ వదిలేయండి అంటూ పోలీసులు వేడుకున్నా.. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని తుళ్లూరు పోలీస్ స్టేషన్ (Tulluru Police Station) తరలించారు.

ఈ తరువాత కొడుకు మృతిపై సమాధానం కోసం అధికారులను, ప్రజాప్రతినిధులను కలిశారు. తన ఆవేదనను చెప్పుకున్నారు. తన కుమారుడికి న్యాయం చేయాలని పలువురిని వేడుకున్నారు. తన ప్రయత్నాలు ఫలించడం లేదనే ఆవేదనతో చివరకు రోడ్డుపైనే తన పోరాటాన్ని కొనసాగించారు మౌలాబీ. మండుటెండను లెక్కచేయకుండా రోడ్డుపై కూర్చున్నారు. వర్షాన్ని సైతం పట్టించుకోకుండా న్యాయం కోసం నిరసన చేపట్టారు. ఈ ప్ర‌క్రియ‌లో ఆరోగ్యం సహకరించకపోయినా వెనక్కి తగ్గలేదు. ఆమె చేతిలో కనిపించే చిన్న కాగితంపై ఉన్న ‘నా కొడుకుకు న్యాయం చేయండి’ అనే విన్నపం వెనుక.. తన బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఆవేదన కనిపించేది.

రోజులు గడిచాయి.. వారాలు గడిచాయి.. నెలలు గడిచాయి. అయినప్పటికీ తన కుమారుడి మృతిపై సరైన సమాధానం, న్యాయం కోసం ఆమె ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. కొడుకు మృతిపై తీవ్ర మనోవేదనకు గురైన మౌలాబీ పురుగుల మందు తీసుకున్నట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో తొలుత ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

అయితే చికిత్స పొందుతూ మౌలాబీ మృతి చెందినట్లు సమాచారం. దీంతో తౌషిక్ మృతితో ఇప్పటికే విషాదంలో ఉన్న కుటుంబానికి మరో భారీ విషాదం ఎదురైంది. ఆరు నెలలుగా తన కుమారుడి కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఆ తల్లి ఇక లేదు. రోడ్డుపై కూర్చుని న్యాయం కోసం పోరాడిన ఆ గొంతు ఇక వినిపించదు. తన బిడ్డకు ఏం జరిగిందో తెలుసుకోవాలన్న తపనతో.. న్యాయం కోసం చివరి వరకు పోరాడిన మౌలాబీ మృతి సింగరాయకొండలో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఒక బిడ్డను కోల్పోయిన కుటుంబం.. ఆ బిడ్డకు న్యాయం కోసం పోరాడిన తల్లినీ ఇప్పుడు కోల్పోయింది. తౌషిక్ మృతి వెనుక అసలు కారణాలేమిటి? మౌలాబీ ఆరు నెలలుగా చేస్తున్న పోరాటానికి ఎందుకు పరిష్కారం లభించలేదు? ఆమె చేసిన ఫిర్యాదులు, డిమాండ్లపై అధికారుల చర్యలు ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు మరోసారి ముందుకు వస్తున్నాయి.

తౌషిక్ మృతి, మౌలాబీ మరణంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. తన కుమారుడి కోసం చివరి వరకు పోరాడిన మౌలాబీ విషాద గాథ సింగరాయకొండ ప్రజలను తీవ్రంగా కలచివేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment