స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎన్యూమరేషన్ పత్రాల్లో సమర్పించిన వివరాల్లో, ముఖ్యంగా పేర్ల నమోదులో పొరపాట్లు గుర్తించడంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి, నటి సమంతతో పాటు నమ్రతా శిరోద్కర్, నటుడు వెంకటేశ్, విజయ్ దేవరకొండలకు కూడా నోటీసులు అందినట్లు సమాచారం. అదే విధంగా క్రీడా రంగానికి చెందిన మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో పాటు ఉపాసనకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
SIR ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో నమోదు చేసిన పేర్లలో తేడాలు లేదా పొరపాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకునేందుకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారు నిర్ణీత సమయంలో అధికారుల ఎదుట హాజరై తమ వివరాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగతంగా హాజరు కావడం సాధ్యం కాకపోతే.. తమ తరఫున మరొకరిని విచారణకు పంపించుకునే అవకాశం కల్పించింది.
సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్యూమరేషన్ పత్రాల్లో నమోదైన వివరాల్లో ఏ విధమైన పొరపాట్లు ఉన్నాయనే దానిపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.








