నా సోద‌రిది ‘మ‌హా పాపం’.. ముద్రగడ గిరిబాబు ఆగ్రహం

నా సోద‌రిది 'మ‌హా పాపం'.. ముద్రగడ గిరిబాబు ఆగ్రహం

Summarize with AI

ముద్రగడ పద్మనాభం మరణం కుటుంబానికి తీరని లోటని ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబు అన్నారు. తమ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముద్రగడను కాపాడేందుకు చివరి వరకు వైద్యసేవలు అందించిన సింధూ ఆస్పత్రి ఛైర్మన్ పార్థసారథిరెడ్డి, వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. కిర్లంపూడిలోని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ముద్ర‌గ‌డ కుమారులు మాట్లాడారు. త‌మ సోద‌రిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తన సోదరి క్రాంతి జనసేన వ్యవస్థను తన రాజకీయాల కోసం ఉపయోగించుకుంటోందని గిరిబాబు ఆరోపించారు. రాజకీయాల కోసం దేవుడిలాంటి తండ్రిని, భూదేవి లాంటి తల్లిని, రామలక్ష్మణుల్లాంటి సోదరులను వదులుకుందని వ్యాఖ్యానించారు. తన సోదరి చేసింది “మహాపాపం” అంటూ గిరిబాబు తీవ్రంగా స్పందించారు.

తమ కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేని ప్రత్యేక కృతజ్ఞతలను వైఎస్ జగన్‌కు తెలియజేస్తున్నామని గిరిబాబు చెప్పారు. తన తండ్రి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయనను ఎలాగైనా బతికించాలని జగన్ ఎంతో ప్రయత్నించారని, నిరంతరం తనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వైద్యులతో మాట్లాడేవారని తెలిపారు. ముద్రగడ మరణానంతరం జగన్ స్వయంగా పాడె మోయడాన్ని జీవితాంతం మర్చిపోలేమన్నారు.

ఇది రాజకీయ లబ్ధి లేదా ఓటు బ్యాంకు కోసం చేసింది కాదని, ఒక కుమారుడు తన తండ్రికి ఇచ్చే గౌరవంలా భావిస్తున్నామన్నారు. జగన్ పట్ల తమ కుటుంబంలో గౌరవం మరింత పెరిగిందని చెప్పారు. ముద్రగడ మృతిపై సానుభూతి తెలిపిన గవర్నర్, ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

నాన్న చివరి కోరిక ప్రకారమే అంత్యక్రియలు
తాను ఎలా నడుచుకోవాలో, తన అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో త‌న‌ తండ్రి ముందుగానే చెప్పారని గిరిబాబు వెల్లడించారు. ముద్రగడ ఎప్పుడూ ప్రభుత్వ అధికార లాంఛనాలను కోరుకోలేదని, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సెల్యూట్లు, సెక్యూరిటీ గార్డులను ఆశించలేదన్నారు. తనను ఎక్కడ ఖననం చేయాలి, భార్యను ముత్తైదువుగానే ఉంచాలి, కర్మకాండలు చేయవద్దని చెప్పడంతో పాటు తనను మానసిక క్షోభకు గురిచేసిన కుమార్తె క్రాంతిని కడచూపునకు కూడా రానివ్వొద్దని ముద్రగడ చెప్పినట్లు గిరిబాబు స్ప‌ష్టం చేశారు.

అంబటిపై పెట్టిన కేసే మాపైనా పెట్టండి
తండ్రి చివరి కోరికకు విరుద్ధంగా పోలీసులు క్రాంతిని బలవంతంగా తీసుకొచ్చారని, ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకోనివ్వకుండా తమ కుటుంబాన్ని అవమానించారని, పోలీసుల తీరును ఎప్పటికీ మర్చిపోమన్నారు. తమ కుటుంబం, తన తండ్రి కోసం పనిచేసిన అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు. “అంబటిపై ఎలాంటి కేసు పెట్టారో అదే కేసు మా కుటుంబంపైనా పెట్టండి” అని సవాల్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment