ఫేస్‌బుక్(Facebook) మాతృసంస్థ మెటా (Meta) మరోసారి న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది. టీనేజర్లను (Teenagers) సోషల్ మీడియాకు (Social Media) బానిసలుగా మార్చేలా ఇన్‌స్టాగ్రామ్‌ను (Instagram) ఉద్దేశపూర్వకంగా రూపొందించిందంటూ అమెరికాలోని (United States) టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం (Tennessee State Government) కోర్టును ఆశ్రయించింది. మెటాతో పాటు సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై (Mark Zuckerberg) కూడా పలు ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో, ఆటోప్లే, రీల్స్, నిరంతర నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు యువతను ఎక్కువసేపు యాప్‌లోనే ఉండేలా ప్రోత్సహిస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల టీనేజర్లలో సోషల్ మీడియా వ్యసనం పెరగడంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రభుత్వం వాదించింది.
అంతేకాదు, ఇన్‌స్టాగ్రామ్ ప్రభావంపై మెటా అంతర్గతంగా నిర్వహించిన పరిశోధనల్లో ప్రమాదకర అంశాలు గుర్తించినప్పటికీ వాటిని ప్రజలకు వెల్లడించలేదని టెన్నెస్సీ (Tennessee) అటార్నీ జనరల్ కార్యాలయం (Attorney General’s Office) ఆరోపించింది. హానికరమైన కంటెంట్‌పై ప్రజలను తప్పుదోవ పట్టించిందని, అందుకే మెటాపై జరిమానా విధించి ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పులు చేయాలని కోర్టును కోరింది. అయితే ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండిస్తూ, వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు సంబంధించి అమెరికా చట్టాల ప్రకారం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పు సోషల్ మీడియా సంస్థలపై భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలకు దారితీయడంతో పాటు, టీనేజర్ల ఆన్‌లైన్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత వేగవంతం చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








