ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మెగా డీఎస్సీ ఉదంతం కుదిపేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలకు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్ల వినియోగంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లాలో స్పోర్ట్స్ కోటా నియామకం స్కామ్ జరిగిందని ప్రాథమికంగా రూడీ చేస్తుండగా.. తాజాగా శ్రీకాకుళం, ఉమ్మడి విశాఖ, వైఎస్సార్ జిల్లాల్లోనూ పలు ఫిర్యాదులు, ఆరోపణలు తెరపైకి రావడం సంచలనం సృష్టిస్తున్నాయి.
కర్నూలు మొదలు.. శ్రీకాకుళంలో..
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్ ఎస్‌జీటీ (తెలుగు)గా ఎంపికై, పోస్టింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన పెద్ద అప్పలరాజుపైనా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఉద్యోగం పొందిన అభ్యర్థి పేరు ‘పెద్ద అప్పలరాజు’ కాగా.. ‘పాండ అప్పలరాజు’ పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. శాప్ పోర్టల్‌లో అభ్యర్థి తమ్ముడి పేరుతో ఉన్న సర్టిఫికెట్‌ను ఎందుకు అప్‌లోడ్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అదేవిధంగా సదరు సర్టిఫికెట్‌ను మూడు సార్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని ఫిర్యాదుదారులు కోరుతున్నారు.
విశాఖలో మరోకటి..
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ బ్లైండ్ సర్టిఫికెట్ ఆధారంగా ఒక వ్యక్తి ఉద్యోగం పొందారని మరో మహిళా అభ్యర్థి ఫిర్యాదు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితాను ఇవ్వాలని విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్‌ను మీడియా ప్రతినిధులు కోరినప్పటికీ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాబితా ఇవ్వలేమని ఆయన చెప్పినట్లు సమాచారం. ఏదైనా సమాచారం కావాలంటే లిఖితపూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామని డీఈవో వెల్లడించినట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ జిల్లాలోనూ..
వైఎస్సార్ జిల్లాలో మరో ఫిర్యాదు అందింది. డీఎస్సీ నియామకాల్లో రిజర్వేషన్ల వినియోగంపైనా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లాకు చెందిన మనూర్ రసూల్ అనే అభ్యర్థి విషయంలో రిజర్వేషన్ కేటగిరీ మార్పుపై వివాదం నెలకొంది. 2008, 2012, 2018 డీఎస్సీల్లో తాను బీసీ–ఈ కేటగిరీగా నమోదు చేసుకున్న రసూల్.. 2025 డీఎస్సీలో మాత్రం ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసుకుని ఉద్యోగం పొందారని ఆరోపణలు ఉన్నాయి.
రసూల్ కేటగిరీ మార్పు కారణంగా తనకు ఉద్యోగం దక్కలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరీలో మార్పు జరిగిందన్న ఆరోపణలపై ఏడాది కాలంగా జిల్లా యంత్రాంగం విచారణ కొనసాగిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు తుది నిర్ణయం వెలువడలేదని జమీల్ పేర్కొంటున్నారు. రసూల్‌పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అవకతవకలు రుజువైతే చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.
తనకు రావాల్సిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించాలని జమీల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, రిజర్వేషన్ కేటగిరీలకు సంబంధించిన ఫిర్యాదులు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో డీఎస్సీ నియామకాలపై సమగ్ర పరిశీలన అవసరమన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
సీబీఐ విచారణకు డిమాండ్
డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులు ఒక్కొక్కటిగా చంద్రబాబు ప్రభుత్వానికి చుట్టుకుంటున్నాయి. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మరి వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తప్పు జరిగింది కాబట్టే ఫిర్యాదులు బయటకు వస్తున్నాయని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను అర్హులకు కాకుండా నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారికి కట్టబెట్టారని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపణలకు అనుగుణంగానే ఆధారాలతో బాధితులు ఫిర్యాదులు చేయడం రాష్ట్రంలో సంచలన సృష్టిస్తోంది.
వెలుగులోకి వస్తున్న ఫిర్యాదులన్నింటిపై సమగ్ర విచారణ జరిపితేనే వాస్తవాలు బయటపడతాయని అభ్యర్థులు, ఫిర్యాదుదారులు కోరుతున్నారు.









‘డీఎస్సీ’లో గట్టిగా ఇరుక్కున్నారు.. తప్పించుకోలేరు