మెగా డీఎస్సీ నియామకాల్లో(Mega DSC Recruitments) అక్రమాలు (Irregularities) జరిగాయంటూ బాధిత అభ్యర్థులు, ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ.. సోషల్ మీడియాలో ఆ అంశాలపై వస్తున్న పోస్టులు, వీడియోలు భారత్‌లో(India) కనిపించకుండా చేయడం కలకలం రేపుతున్నాయి. శాటిలైట్ మీడియా ఛానల్స్‌కు (Satellite Media Channels) సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను సైతం ప్రభుత్వం(Government) ఇండియాలో కనిపించకుండా నిలుపుదల చేయడం సంచలనంగా మారింది.
ఫస్ట్ ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఎందుకు దక్కలేదని అడగడం నుంచి.. స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) పరీక్ష లేకుండా నియామకాలు ఎలా జరిగాయన్న ప్రశ్నల వరకు పలు అంశాలను సోషల్ మీడియా వేదికలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే వాటిలో కొన్ని పోస్టులు, ఖాతాలపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సమాధానాలు లేవు.. పోస్టులపై మాత్రం చర్యలా?
డీఎస్సీ నియామకాలపై బాధితులు అధికారులను ఆశ్రయించడంతో పాటు కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు (CBI Investigation) డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి మెరిట్ జాబితాలు, నియామక ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. ఇదే సమయంలో డీఎస్సీపై ప్రశ్నించే సోషల్ మీడియా పోస్టులు భారత్‌లో అందుబాటులో లేకుండా చేయడం చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలకు తావిస్తోంది.
కొన్ని సందర్భాల్లో Meta నుంచి “భారతదేశంలోని చట్టపరమైన అవసరాల మేరకు ఈ ఖాతాను తాత్కాలికంగా పరిమితం చేశాం” అనే సందేశాలు వస్తున్నాయి. ఒక డీఎస్సీ పోస్టును కేంద్ర ప్రభుత్వం లేదా చట్ట అమలు సంస్థ నుంచి వచ్చిన నోటీసు మేరకు ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బి) కింద నిరోధించినట్లు చూపుతున్న నేపథ్యంలో.. ఆ నోటీసు ఎవరు ఇచ్చారు? ఏ పోస్టులో ఏ చట్టవిరుద్ధ అంశం ఉందని నిర్ణయించారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వరుసగా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలు
Sakshi TV, bigtv_telugu, jaganannaconnects, kickjaganhaters2.0, graduate_adda, Jagan Anna, warriorsjagan, theriseofysjagan, jaganaithene chesthadu వంటి ఖాతాలు భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారని పేర్కొంటున్నారు. Sakshi TV ఖాతాను ఏడు రోజులపాటు, మరో ఖాతాను 21 రోజులపాటు పరిమితం చేసినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ 1న పోస్టు చేసిన రెండు వీడియోలు, ఆగస్టు 21న డీఎస్సీ అక్రమాలపై పెట్టిన మరో పోస్టును సెప్టెంబర్ 2న భారత్‌లో సెన్సార్షిప్ చేసినట్టుగా ఆధారాలు చూపుతున్నారు.
డీఎస్సీపై ఇంకా ఎన్నో ప్రశ్నలు
మెగా డీఎస్సీ వ్యవహారంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు రాలేదు? 1:1 నిష్పత్తిలో వెరిఫికేషన్‌కు పిలిచిన వారిలో కొందరికి ఉద్యోగాలు ఎందుకు దక్కలేదు? ఎస్సీఈఆర్టీ, డీఎస్సీ కన్వీనర్ బాధ్యతలు ఒకే అధికారికి ఎందుకు అప్పగించారు? స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా వందల పోస్టులు ఎలా భర్తీ చేశారు? గోల్డ్ మెడల్ (Gold Medal) సాధించిన క్రీడాకారుడికి ఉద్యోగం దక్కకుండా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ (Participation Certificate) ఉన్నవారికి అవకాశం ఎలా లభించింది? కౌతాళం, శ్రీకాకుళం, కడప, గుంటూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారు? వంటి ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
అర్హతలేని వారికి ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలు, తప్పుడు సర్టిఫికెట్ల వ్యవహారాలు, నియామక నిబంధనల్లో మార్పులు వంటి అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

‘డిజిటల్ ఎమర్జెన్సీ’ అంటూ విమర్శలు
ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులపై మాత్రమే వేగంగా చర్యలు తీసుకుంటున్నారా? అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఇదే స్థాయిలో చర్యలు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు ప్రతిపక్ష వర్గాల నుంచి వస్తున్నాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలపై అసభ్యకర పోస్టులు, మార్ఫింగ్ చిత్రాలు, బెదిరింపులు చేస్తున్న ఖాతాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వెల్లడించాలని వారు కోరుతున్నారు.
సోషల్ మీడియా పోస్టులను నిరోధించడం ద్వారా డీఎస్సీపై ఉన్న ప్రశ్నలు, బాధితుల ఆవేదనను శాశ్వతంగా అణచివేయలేరని విమర్శకులు అంటున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోస్టులపై చర్యల కంటే.. డీఎస్సీ నియామకాలపై పూర్తి రికార్డులను ప్రజల ముందు ఉంచి, ఆరోపణలపై స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
పోస్టులను కనిపించకుండా చేయవచ్చు.. కానీ వాటి వెనుక ఉన్న ప్రశ్నలను మాత్రం మాయం చేయలేరు. డీఎస్సీ నియామకాలపై సమాధానాలు వచ్చే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.








బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?