తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics)కొండా సురేఖ (Konda Surekha) అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఆమెను బీజేపీలోకి (BJP)తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలో.. ఆ పార్టీలోనే చేరికపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్‌రావు (Muralidhar Rao) చేసిన ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
సురేఖ చేరికకు ఎంపీ వ్యతిరేకత?
కొండా సురేఖను బీజేపీలోకి తీసుకురావడానికి ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బీజేపీ ఎంపీ ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మురళీధర్‌రావు పెట్టిన పోస్ట్‌పై బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
కేంద్రంలో బీజేపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని చెప్పుకుంటున్నప్పుడు.. రాష్ట్రంలోనూ అదే విధానాన్ని కొనసాగించాలా? అనే చర్చ పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖను పార్టీలోకి తీసుకోవడం ద్వారా బీజేపీ తన రాజకీయ విలువలకు భిన్నంగా వ్యవహరిస్తుందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్‌లోనూ నో ఎంట్రీ?
మరోవైపు కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి(BRS) తీసుకోవద్దని ఆ పార్టీ కేడర్ కూడా అధిష్టానానికి సూచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కేటీఆర్(KTR), సమంత (Samantha) విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన సురేఖకు పార్టీలో స్థానం ఇవ్వకూడదని కొందరు నేతలు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి (Jagdish Reddy) సైతం కొండా సురేఖకు బీఆర్ఎస్‌లోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పేశారు.
అన్యాయాన్ని ఖండిస్తున్నా.. పార్టీలోకి మాత్రం నో..
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసినప్పటికీ.. ఆమెను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో మాత్రం రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు కొండా సురేఖకు జరిగిన అన్యాయాన్ని రాజకీయంగా ప్రశ్నిస్తూ.. మరోవైపు ఆమె చేరికను వ్యతిరేకించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఆమె తదుపరి రాజకీయ అడుగు ఏమిటన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.








