ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాలపై కొనసాగుతున్న వివాదంలో మరో అంశం తెరపైకి వచ్చింది. స్పోర్ట్స్ కోటా కింద టీచర్ ఉద్యోగం పొందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెద్ద అప్పలరాజు తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. దరఖాస్తు సమయంలో తన సర్టిఫికెట్లకు బదులుగా పొరపాటున తన తమ్ముడి సర్టిఫికెట్లను అప్లోడ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అధికారుల అనుమతితో లేఖ రాసి వాటిని మరలా మార్చినట్లు తెలిపారు. ఈ పరిణామాలతో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల ప్రక్రియపై మరిన్ని ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనపై వచ్చిన ఆరోపణలకు పెద్ద అప్పలరాజు వివరణ ఇస్తూ.. గోవాలో జరిగిన 37వ నేషనల్ గేమ్స్‌లో తాను క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లినట్లు తెలిపారు. 6వ ఎలైట్‌మెంట్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో పాల్గొనడం ద్వారా నేషనల్ గేమ్స్‌కు అర్హత సాధించినట్లు వివరించారు. తాను, తన తమ్ముడు ఒకేసారి ఫైనల్స్ ఆడటంతో ఇంట్లో ఇద్దరి సర్టిఫికెట్లు ఒకే చోట ఉండేవని చెప్పారు. ఈ క్రమంలో దరఖాస్తు సమయంలో తన సర్టిఫికెట్లకు బదులుగా తన తమ్ముడి సర్టిఫికెట్లను పొరపాటున అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఈ విషయం గుర్తించి.. అధికారుల అనుమతితో లేఖ రాసి సర్టిఫికెట్లను మార్చినట్లు చెప్పారు.
ఇదే సమయంలో అర్చరీలో గోల్డ్ మెడల్ సాధించిన దుర్గయ్యకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇవ్వని అంశం కూడా చర్చకు వస్తోంది. తన గోల్డ్ మెడల్ సర్టిఫికెట్‌ను దరఖాస్తులో సమర్పించలేదనే కారణంతో దుర్గయ్య అభ్యర్థిత్వాన్ని అధికారులు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవైపు అప్పలరాజుకు వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికెట్లను మార్చుకునే అవకాశం లభించిందని ఆయన స్వయంగా చెబుతుండగా.. మరోవైపు గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యకు ఇలాంటి అవకాశం ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, వెరిఫికేషన్ ప్రక్రియ, అర్హతల నిర్ధారణపై ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పలరాజు చెప్పినట్లుగా సర్టిఫికెట్ల మార్పు అధికారుల అనుమతితో జరిగితే.. దుర్గయ్య దరఖాస్తును ఏ నిబంధనల ప్రకారం తిరస్కరించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ అంశాలపై సమగ్ర విచారణ జరిపి, స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాలలో నిబంధనలు అందరికీ సమానంగా అమలయ్యాయా లేదా అన్నది తేల్చాలని దుర్గయ్య లాంటి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
టీచర్ పెద్ద అప్పలరాజు కీలక వ్యాఖ్యలు
— Telugu Feed (@Telugufeedsite) September 5, 2026
తన తమ్ముడి సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేశానని అప్పలరాజు వెల్లడి
అనంతరం అధికారుల అనుమతితోనే సర్టిఫికెట్ మార్చినట్లు పేర్కొన్న అప్పలరాజు
ఆర్చరీ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యకు మాత్రం ఉద్యోగం ఎందుకు దక్కలేదు?
గోల్డ్ మెడల్ సర్టిఫికెట్ అప్లోడ్… https://t.co/Ticm9Gk5N5 pic.twitter.com/zJ8frSJdqr








అయ్యన్న రిటైర్మెంట్.. స్పీకర్ సెంటిమెంటా..? జగన్ భయమేనా?