ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ సీహెచ్. అయ్యన్నపాత్రుడు ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని, ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుని విశ్రాంతి తీసుకుంటానని స్పష్టం చేశారు. తన వయసు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అయ్యన్నపాత్రుడి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన.. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకూ కూడా మూడు సంవత్సరాలు టైం ఉంది.. రెండేళ్లు అయిపోయాయి. ఆ తర్వాత నేను పోటీ చేయదలుచుకోలేదు. ఇక ఖతం అయిపోతుంది అని డిసైడ్ అయిపోయాను. ఈ మూడు సంవత్సరాల్లో నేను ఏదైనా చేయగలిగితే చేస్తా. తర్వాత చేసే అవకాశం నాకు ఉండదు’’ అని అయ్యన్నపాత్రుడు అన్నారు.
అయ్యన్నపాత్రుడు పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఇకపై ఎన్నికల బరిలో ఉండబోనని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఏపీ చరిత్రలో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన కీలక నేతలు ఆ తర్వాతి ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు చాలా తక్కువ. 1991-94 మధ్య స్పీకర్‌గా పనిచేసిన శ్రీపాదరావు ఆ తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందారు. మహిళా స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభాభారతి, 2004-2009 మధ్య స్పీకర్‌గా ఉన్న కె.ఆర్. సురేష్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్, కోడెల శివప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సెంటిమెంటే అయ్యన్న పాత్రుడు నిర్ణయానికి కారణమా అనే చర్చ జరుగుతోంది.
మరోవైపు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2029లో తిరిగి అధికారంలోకి వస్తే.. గతంలో జగన్ ఓడిపోయాడు కానీ, చనిపోలేదు అని అయ్యన్న చేసిన ఇలాంటి తరహా వ్యాఖ్యలకు కచ్చితంగా రివేంజ్ ఉంటుందని భయం వెంటాడుతోందా..? అందుకే ముందుగానే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రస్తుతం తన చేతిలో ఉన్న మూడేళ్లలో నియోజకవర్గానికి, రాష్ట్రానికి సాధ్యమైనంత మంచి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తానని అయ్యన్నపాత్రుడు చెప్పడం ద్వారా.. తన రాజకీయ ప్రస్థానానికి క్రమంగా ముగింపు పలకబోతున్న సంకేతాలు ఇచ్చారు.








