ఏపీ రాజకీయాల్లో రాజకీయ రచ్చ మరింత రక్తికట్టిస్తోంది. ఒకవైపు ఒక యువకుడి అనుమానాస్పద లాకప్ డెత్ తో ఒక తల్లి కడుపుకోత, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే.. అధికార పక్షం మాత్రం వ్యూహాత్మకంగా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు ఒకే చర్చ నడుస్తోంది.. “ఒక భయంకరమైన లాకప్ డెత్‌ను టోన్ డౌన్ చేయడానికి.. ఒక మేకప్ కిట్ వివాదాన్ని కావాలనే హైలైట్ చేస్తున్నారా?”
హోంమంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలతో ఈ పొలిటికల్ డ్రామాకు పునాది పడింది. “గుడ్డు పగలగొట్టడం మాకూ వచ్చు” అంటూ ఆమె గుడివాడ అమర్ ను ఉద్దేశించిన వాడిన పరుష పదజాలానికి కౌంటర్‌గా.. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ ఆమెను “మేకప్ మంత్రి” అని వ్యాఖ్యానించారు.
మొదట సాధారణంగానే కనిపించిన ఈ కామెంట్.. రెండు రోజుల తర్వాత ఊహించని మలుపు తిరిగింది. హోంమంత్రి కట్టుబొట్టును, రూపాన్ని అవమానించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్ మీట్లు, ట్వీట్లు, వీడియో బైట్లతో హంగామా సృష్టించాయి. ఇది యావత్ మహిళా లోకానికే అవమానమంటూ ప్రచారం మొదలుపెట్టాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి అనితకు మద్దతుగా ట్వీట్ చేశారు. మహిళల పట్ల గౌరవం ఉండాలంటూ హితబోధ చేశారు.
అయితే అమర్నాథ్ మాత్రం తాను కేవలం ఒక వ్యక్తి అహంకారాన్ని మాత్రమే ప్రశ్నించానని, మహిళలను ఉద్దేశించి అన్న మాటలు కావని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ, టీడీపీ-జనసేన కూటమి దీనిని వదలడం లేదు. మాజీ మంత్రిని అరెస్ట్ చేయబోతున్నారంటూ లీకులు కూడా ఇస్తున్నారు.
కృష్ణా లంక ‘లాకప్ డెత్’ సంచలనం!
ఈ మేకప్ వివాదం వెనుక అసలు గేమ్ ప్లాన్ ఏంటో విజయవాడ కృష్ణా లంక పోలీస్ స్టేషన్ ఘటన బయటపడటంతో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జనసేన పార్టీకి చెందిన కాపు సామాజికవర్గ యువకుడు గాదె సాయికృష్ణ అనే 26 ఏళ్ల యువకుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకుని లాకప్ డెత్ చేశారనే వార్త ఏపీలో దావాగ్నిలా వ్యాపిస్తోంది. అంతటితో ఆగకుండా, శవం కూడా దొరక్కుండా పోలీసులు దహనం చేసేశారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కగానొక్క కొడుకు నెల రోజులుగా కనిపించకపోవడంతో ఆ తల్లి కన్నీరు మున్నీరవుతోంది. “నా కొడుకు బతికుంటే ఒక్కసారి నా కళ్లకు చూపించండి.. చంపేసి ఉంటే కనీసం మృతదేహాన్ని అయినా ఇవ్వండి.. కళ్లారా చూసుకుంటా” అంటూ ఆమె ఆవేదన చెందుతున్న దృశ్యాలు సామాన్య ప్రజలను సైతం కలచివేస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పటికే హైకోర్టుకు చేరడం, ఉన్నతాధికారులు సీఐని వీఆర్ (Vacancy Reserve)కు పంపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
లాకప్ డెత్ నుంచి డైవర్షన్ కోసమే ‘మేకప్ పాలిటిక్స్’?
సొంత కూటమికి (జనసేన) చెందిన యువకుడే పోలీస్ కస్టడీలో మరణించాడనే ఆరోపణలు రావడం, పోలీసుల వ్యవహారం బయటపడటం చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించే అంశం. చట్టాన్ని.. కోర్టులను కాదని, ఒక మనిషిని లేకుండా చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా? అంటూ ప్రతిపక్షాలు, న్యాయ నిపుణులు గట్టిగా నిలదీస్తున్నాయి. ఈ పెను ప్రమాదం నుండి తప్పించుకోవడానికే, కూటమి ప్రభుత్వం ‘మేకప్ మంత్రి’ వ్యాఖ్యలను మళ్లీ తెరపైకి తెచ్చిందని టాక్ నడుస్తోంది.
రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ కొత్తేమీ కాదు. కానీ ఒక యువకుడి ప్రాణం పోయిందనే ఆరోపణలు, ఒక తల్లి కన్నీటి రోదనల కంటే.. ఒక రాజకీయ విమర్శే పెద్దదిగా చూపిస్తూ సోషల్ మీడియాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను నింపేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు వస్తున్నాయి.








