‘కంప‌ట్లేదా.. కంపడుతోంది’.. లోకేష్ తెలుగుపై ట్రోలింగ్

'కంప‌ట్లేదా.. కంపడుతోంది'.. లోకేష్ తెలుగుపై ట్రోలింగ్

Summarize with AI

కూటమి ప్రభుత్వంలో (Alliance Government) అత్యంత కీలకమైన వ్య‌క్తిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ (Nara Lokesh) తెలుగు భాష ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స్క్రిప్టు చూసి చ‌దివే ప్రసంగాల్లో దొర్లుతున్న పొరపాట్లు ట్రోల‌ర్స్‌కు ఆయుధంగా మారాయి. ప్రజాప్రతినిధులు వేదికలపై మాట్లాడేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిశితంగా గమనిస్తుంటారు. ఈ క్రమంలో భోగాపురం విమానాశ్రయం (Bhogapuram Airport) ప్రారంభోత్సవ సభలో లోకేష్ మాట్లాడిన మాటలు నెటిజన్లకు న‌వ్వులు పూయిస్తుండ‌గా, వైరివ‌ర్గం చిన‌బాబు తెలుగు భాష‌పై సెటైర్లు పేలుస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్న భోగాపురం బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ.. “అల్లూరి సీతారామరాజులోని (Alluri Sitarama Raju) పట్టుదల(Determination), పౌరుషం (Valor), దేశభక్తి (Patriotism).. మన ప్రధాని నరేంద్ర మోదీలో కంపడుతోంది (కనబడుతోంది)” అని వ్యాఖ్యానించారు. అలాగే ‘ఎయిర్‌పోర్ట్'(Airport) అనే పదాన్ని ‘ఎయిర్ పార్ట్’ (Air Part) అని ఉచ్ఛరించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ క్షణాల్లో వైరల్ అవ్వడంతో, నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు. లోకేష్ తెలుగు భాష వీడియోలు వైరల్ గా మారాయి.

రాజకీయాల్లోకి వచ్చిన కొత్త‌లో లోకేష్ మాట్లాడిన తెలుగు కంటే.. ప్ర‌స్తుతం మాట్లాడుతున్న తెలుగు చాలా బెటర్ అంటున్నారు. ఎంతో కొంత మెరుగుపరుచుకున్నప్పటికీ, ఎదురుగా స్క్రిప్ట్ (Script) లేనప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లుతున్నాయంటున్నారు. “దేశభక్తి, పట్టుదల వంటి ఉన్న‌త‌మైన ప‌దాలు మాట్లాడే ముందు, తెలుగు భాషను తప్పుల్లేకుండా మాట్లాడటంలో లోకేష్ పట్టుదల చూపించాలి” అంటూ చురకలు అంటిస్తున్నారు.

నారా లోకేష్ గతంలోనూ కొన్ని సందర్భాల్లో పదాల ఉచ్ఛారణలో దొరికిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. గత విలేకరుల సమావేశంలో “కంపట్లేదా.. మిమ్మల్ని అడుగుతున్నా కంపట్లేదా మనకి” అంటూ మాట్లాడటం.

తల్లికి వందనం సభలో ‘అల్లూరి సీతారామరాజు’ పేరును స్పష్టంగా పలకలేకపోవడం. అదే స‌భ‌లో ‘మార్గదర్శకం’ వంటి కొన్ని క్లిష్టమైన తెలుగు పదాలను ఉచ్ఛరించడంలో ఇబ్బంది పడటం వంటి వీడియోల‌ను కంప‌డుతోంది వీడియోకు జ‌త‌చేసి నెట్టింట వ‌దులుతున్నారు.

కూట‌మిలో సీఎం చంద్ర‌బాబు త‌రువాత అంతా తానే అని త‌న పార్టీ నేత‌ల ద్వారా చెప్పిస్తున్న నారా లోకేష్‌.. ముఖ్యమైన నాయకుడిగా ఎదుగుతున్న త‌రుణంలో మాతృభాష‌ను త‌ప్పుల్లేకుండా చ‌ద‌వ‌డం కూడా నేర్చుకుంటే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. ఎంత‌సేపూ ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్ల‌పై నింద‌లేసేందుకు పెట్టే శ్ర‌ద్ధ‌.. తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడటంపై కూడా వహించాలని సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు, నెటిజన్లు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment