తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్‌లో (TFTDDA) అంతర్గత విభేదాలు, వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య (Johnny Master Wife) సుమలత (Sumalatha) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు, తీవ్ర వివాదాస్పదంగా మారిన డాన్సర్స్ అసోసియేషన్ ఉపఎన్నికల ప్రక్రియను లేబర్ కమిషన్ (Labour Commission) సస్పెండ్ (Suspend) చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది.
డాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలత వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ఫెడరేషన్ ఒక అధికారిక లేఖను విడుదల చేసింది. సినీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందాలను, ప్రాథమిక సూత్రాలను పక్కనబెట్టి, అధికార దుర్వినియోగంతో సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆ లేఖలో గట్టిగా ప్రశ్నించింది. రాజీనామా (Resignation) చేసిన కార్యవర్గ సభ్యులను మళ్లీ కలుపుకొని పోవాలని, అసోసియేషన్‌కు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా మళ్లీ కొత్త ఎన్నికలు నిర్వహించాలని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
సుమలత తన ఏకపక్ష నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, ప్రధాన కార్యదర్శిని మినహాయించి రాజీనామా చేసిన మిగిలిన సభ్యుల రాజీనామాలను రద్దు చేసి మళ్లీ బాధ్యతల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఉపఎన్నికలను (By-Elections) నిలిపివేసేందుకు రాజీనామా చేసిన కార్యవర్గ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా సుమలత ముందస్తుగా కేవియట్ పిటిషన్ (Caveat Petition) దాఖలు చేసినట్లు తెలిసింది. సంస్థాగత నియమావళిని కాదని, ఇలాంటి చర్యలకు పూనుకోవడంపై తోటి సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుమలత తన ఏకపక్ష వైఖరిని మార్చుకోకపోతే, ఫెడరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి మెజారిటీ డాన్సర్స్ అభిప్రాయాలను సేకరిస్తామని, వారి నిర్ణయానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని ఫెడరేషన్ హెచ్చరించింది.
“పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత కలిసి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు చెల్లవు” అని అసోసియేషన్‌లోని మెజారిటీ డాన్సర్ సభ్యులు బహిరంగంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.








