విజయవాడ (Vijayawada)గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్ డెత్ కేసు (Lockup Death Case) దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న సురేష్ (Suresh)పరారీలో ఉన్నట్లు ప్రకటించిన సిట్, అతడి ఆచూకీ తెలిపి దర్యాప్తునకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
కృష్ణలంక పీఎస్లో (Krishnalanka Police Station) సాయికృష్ణ లాకప్ డెత్ అనంతరం బాధిత కుటుంబంతో సెటిల్మెంట్ (Settlement) చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సీఐ నాగరాజుకు (CI Nagaraju) సురేష్ సన్నిహితుడిగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
సిట్ ఎదుట విచారణకు హాజరైన అనంతరం కేసు నమోదవడంతో సురేష్ పరారైనట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై కేసు నమోదు కాగా, ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సురేష్ పరారీలో ఉన్న విషయాన్ని సిట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (Andhra Pradesh High Court) కూడా నివేదించింది.
పరారీలో ఉన్న నిందితుడి పూర్తి వివరాలు, ఫొటోను విడుదల చేసిన సిట్, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతో విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. నిందితుడి ప్రస్తుత ఆచూకీ, సంచరిస్తున్న ప్రాంతాలు, తలదాచుకున్న ప్రదేశానికి సంబంధించిన విశ్వసనీయ సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరింది.
చిన్న సమాచారం కూడా నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా మారుతుందని సిట్ పేర్కొంది. అలాగే పరారీలో ఉన్న నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచిపెట్టడం, సహాయం చేయడం లేదా ఏ రూపంలోనైనా సహకరించడం చట్టరీత్యా నేరమని ప్రజలను హెచ్చరించింది.








