వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం భావోద్వేగంగా సాగింది. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ మార్పు నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మజ్జి శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నేతలు భావోద్వేగానికి గురవుతూ.. పార్టీ మారాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
కార్యకర్తల ప్రసంగాల అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. నమ్మినవారే మోసం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో బొత్స ఒక్కసారిగా కంటతడి పెట్టడంతో సమావేశంలో ఉన్న కార్యకర్తలు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో వ్యక్తులు రావచ్చు.. వెళ్లిపోవచ్చు.. కానీ పార్టీ మాత్రం శాశ్వతమని ఆయన వెల్లడించారు. ప్రస్తుత పరిణామాలతో కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. వైసీపీకి కార్యకర్తలే బలమని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.
వైఎస్ జగన్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురైన సమయంలో సభలో ఉన్న పలువురు కార్యకర్తలు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీలో నాయకులు, కార్యకర్తల మధ్య ఉన్న అనుబంధం, పార్టీ పట్ల తమ నిబద్ధతను పలువురు నేతలు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.
కంటతడి పెట్టుకున్న బొత్స సత్యనారాయణ
— Telugu Feed (@Telugufeedsite) September 10, 2026
గవిరిడిలో నిర్వహించిన భేటీలో భావోద్వేగానికి గురైన బొత్స
నాయకులు, కార్యకర్తల భేటీలో కంటతడి పెట్టుకున్న బొత్స సత్యనారాయణ pic.twitter.com/rws6ioQhTm








