భార్యను హత్య చేసిన భర్త.. అనాథలైన చిన్నారులు

భార్యను హత్య చేసిన భర్త.. అనాథలైన చిన్నారులు

Summarize with AI

రెండో వివాహం చేసుకున్న భార్య‌పై అనుమానంతో రోడ్డుపై ప్ర‌యాణిస్తున్న కారులోనే హ‌త్య చేశాడు ఓ కిరాత‌క భ‌ర్త‌. ఖమ్మం నగరంలో జ‌రిగిన దారుణ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను భర్త హత్య చేసినట్లు సమాచారం. కారులో వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ చివరకు భార్య ప్రాణాలు తీసింది.

వివరాల్లోకి వెళితే.. ఖమ్మం నగరానికి చెందిన రేణుకకు విద్యాసాగర్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. విద్యాసాగర్‌కు ఇది రెండో వివాహం. భార్యపై అనుమానంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ స‌మేతంగా కారులో ప్రయాణిస్తున్న సమయంలో రఘునాథపాలెం సమీపంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ జ‌రిగింది. ఆ సమయంలో విద్యాసాగర్ తన భార్య రేణుక గొంతు నులిమి హత్య చేశాడు.

భార్యను హతమార్చిన అనంతరం విద్యాసాగర్ ఇల్లెందులోని బంధువులకు ఫోన్ చేశాడు. తాను చనిపోతున్నానని వారికి ఫోన్‌లో స‌మాచార‌మిచ్చాడు. దీంతో ఆందోళనకు గురైన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యాసాగర్ ప్రగతి స్కూల్ సమీపంలో కారును పక్కకు ఆపి ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రేణుక హత్యతో ఆమె పిల్లలు అనాథలుగా మారారు. కేవలం నాలుగు నెలల క్రితమే వివాహం జరిగిన నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్యాభర్తల మధ్య గొడవకు అసలు కారణం ఏమిటి? అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే ఈ హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి వాంగ్మూలం, పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment