త‌మిళ‌నాడు మరణశిక్ష‌.. ఏపీలో రిపీట్ అవుతుందా..?

త‌మిళ‌నాడు మరణశిక్ష‌.. ఏపీలో రిపీట్ అవుతుందా..?

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh)విజయవాడ (Vijayawada) నగరం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 1980వ దశకంలో వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radhakrishna), వంగవీటి రంగా (Vangaveeti Ranga) సోదరులు లాకప్ డెత్‌లు(Lockup Deaths), అన్యాయాలపై పోరాడిన రోజులను గుర్తుచేస్తూ.. ప్రస్తుతం నగరంలో అటువంటి దారుణ పరిస్థితులు పునరావృతమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయికృష్ణ (Gade Saikrishna) అనే కాపు (Kapu) సామాజికవర్గ యువకుడి అదృశ్యం కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పలు పాత కేసుల్లో నిందితుడైన సాయికృష్ణను విచారణ పేరుతో మార్కాపురం (Markapuram) నుంచి పిలిపించిన కృష్ణలంక పోలీసులు.. ఆ తర్వాత అతడిని కనిపించకుండా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

తన కుమారుడు పోలీస్ కస్టడీ (Police Custody) నుంచి కనిపించకుండా పోయాడని, క‌న్న‌బిడ్డ ప్రాణాల‌తో ఉన్నాడో.. లేడోన‌ని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో (AP High Court) హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జూన్ 15న సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే, పోలీసులు ఆరోజు అతడిని ప్రొడ్యూస్ చేయక‌పోవ‌డంతో ఆ త‌ల్లి అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. దీనికి తోడు సాయికృష్ణ‌ను అరెస్ట్ చేసి సీఐ నాగ‌రాజు (CI Nagaraju) బెదిరిస్తూ అన్న మాట‌లు కోర్టుకు తెల‌ప‌డంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 29వ తేదీ లోపు సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచకపోతే కృష్ణలంక సీఐపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది.

మరోవైపు ఈ కేసులో ప్రతిపక్ష వైసీపీ(YSRCP) సాయికృష్ణను పోలీసులు లాకప్‌లోనే చిత్రహింసలు పెట్టి చంపేశారని, ఆధారాలు దొరకకుండా అతని మృతదేహాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు (Constables) బైక్‌పై కృష్ణలంక శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహనం చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ప్రెస్ మీట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. అతన్ని చంపేసి పెద్ద క్రిమినల్‌గా చూపేందుకు పోలీసులు కుట్ర పన్నారని మండిపడ్డారు.

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Vijayalakshmi) మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టుకు వెళ్లకుండా ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటికి వచ్చి సెల్‌ఫోన్ లాక్కున్నారని, స్టేషన్‌కు తీసుకెళ్లాక “నీ కొడుకు ఇక లేడనుకో.. ఆశలు వదిలేసుకో” అని సీఐ నాగరాజు తనతో అన్నట్లు ఆమె విలపించారు. తన కుమారుడి ప్రాణాలు కాపాడాలని ఎంత ప్రాధేయపడినా పోలీసులు ఆచూకీ చెప్పలేదని, అనుమానంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న శవాలను కూడా వెతుక్కున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్టు హెచ్చరికలు, రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కృష్ణలంక సీఐ నాగరాజును వీఆర్‌కు పంపుతూ విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మురళీకృష్ణను కొత్త సీఐగా నియమించారు. ఏ తప్పూ జరగకపోతే ప్రభుత్వం సీఐపై ఎందుకు చర్యలు తీసుకుంటుందని, దీనిని బట్టే లాకప్ డెత్ అనుమానాలు నిజమౌతున్నాయని కాపు సామాజికవర్గ నేతలు ఆరోపిస్తున్నారు.

తమిళనాడు లాకప్ డెత్ కేసు గుణపాఠం ఏది?
ఇటీవలే 2026 ఏప్రిల్ 6న తమిళనాడులోని సాత్తాన్‌కుళం తండ్రీకొడుకుల (జయరాజ్(Jayaraj), బెన్నిక్స్(Bennix)) లాకప్ డెత్ కేసులో మదురై కోర్టు (Madurai Court) 9 మంది పోలీసులకు ఏకకాలంలో ఉరిశిక్ష విధిస్తూ దేశ చరిత్రలోనే సంచలన తీర్పు ఇచ్చింది. కేవలం షాపు ఎక్కువసేపు తెరిచారనే చిన్న కారణంతో లాకప్‌లో పెట్టి క్రూరంగా హింసించి చంపినందుకు కోర్టు ఆ శిక్ష విధించింది.

ఇటువంటి కఠినమైన తీర్పులు వస్తున్నా ఆంధ్రప్రదేశ్ పోలీసులు (Andhra Pradesh Police) గుణపాఠాలు నేర్చుకోకపోవడం వల్లే ఇలాంటి మిస్టరీ అదృశ్యాలు, లాకప్ మరణాలు పునరావృతమవుతున్నాయని న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. మ‌రి అంద‌రూ అనుమానిస్తున్న‌ట్టుగా కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ‌ను లాక‌ప్‌డెత్ చేసి ఉంటే.. కృష్ణ‌లంక స్టేష‌న్‌లోని ఆ బాధ్యుల‌కూ ఆ త‌ర‌హా శిక్ష పండుతుందా..? జూన్ 29న కోర్టు విచారణలో పోలీసులు ఎలాంటి సమాధానం చెప్తారనే దానిపైనే సాయికృష్ణ విష‌యంలో అసలు నిజం ఆధారపడి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment