తెలుగు సినీ పరిశ్రమలో తన సహజమైన నటన, ప్రత్యేక హాస్యశైలితో ప్రేక్షకుల మన్ననలు పొందిన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (Senior Character Artist) పావలా శ్యామల (Pavala Shyamala) కన్నుమూశారు(Passed Away). గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో (Severe Illness) బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని (Hyderabad) ఉస్మానియా ఆసుపత్రిలో (Osmania Hospital) చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఆసుపత్రి వైద్యుల సమాచారం ప్రకారం.. జూలై 28 తెల్లవారుజామున సుమారు 1:52 గంటలకు గుండెపోటు (Heart Attack) రావడంతో ఆమె మరణించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో (Mortuary) భద్రపరిచారు. పలు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో వందలాది చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పావలా శ్యామల మరణం సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.
గత కొన్నేళ్లుగా పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు గతంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆమెతో కలిసి నివసిస్తున్న కుమార్తె కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.
ఒకప్పుడు తన సహజ నటనతో ప్రేక్షకులను నవ్వించిన పావలా శ్యామల చివరి రోజుల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కన్నుమూయడం అందరినీ కలచివేస్తోంది. ఆమె మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.








