ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వర్గాలను, నిరసన తెలిపే నాయకులను చట్టం పరిధి దాటి అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగబద్ధంగా లభించే నిరసన తెలిపే హక్కులను కాలరాస్తూ, ప్రతిపక్ష నాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేయడం ద్వారా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారనే చర్చ సర్వత్రా సాగుతోంది.
ఐదేళ్ల క్రితం నాటి కేసుల్లో అసాధారణ ఉత్తర్వులు
విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నిన్న సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సుమారు ఐదేళ్ల క్రితం నమోదైన కేసులకు సంబంధించి ఏకంగా 51 మంది వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవాలని 9 పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ వంటి కీలక నేతల పేర్లు ఉండటం గమనార్హం. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తూ శాప్ (SAP) ఆఫీసు ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై సైతం రౌడీషీట్లు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు.
స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కుట్ర రాజకీయాలు?
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షానికి అభ్యర్థులు లేకుండా చేయడం, ప్రజాస్వామ్యబద్ధమైన పోటీని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రకమైన వేధింపులు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను తొక్కిపెట్టేందుకు కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ వైఖరి, డీఎస్సీ నిర్వహణలోని అక్రమాలు, ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న రాజకీయ కక్షసాధింపు చర్యలపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌తో భేటీ కానున్నారు.
భవిష్యత్తు పర్యవసానాలపై హెచ్చరికలు
రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ సూత్రాలు అమలు జరుగుతున్నాయా లేక అప్రజాస్వామిక పాలన సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నామని ఐదేళ్ల క్రితం నాటి కేసును కూడా తిరగదోడి.. రాజకీయ కక్షసాధింపుల కోసం విచక్షణారహితంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ స్వప్రయోజనాల కోసం, కక్షసాధింపు చర్యల కోసం శ్రేణులను, అధికారులను వాడుకోవడం వల్ల భవిష్యత్తులో అధికార మార్పిడి జరిగినప్పుడు ప్రతీకార చర్యలకు సాధారణ కార్యకర్తలే బలికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ టీడీపీ కార్యకర్తలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.








