హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గంలోనే ఓటర్లు కోలుకోలేని తీర్పునిచ్చారు. హోంమంత్రి హోదాలో ఉన్న అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లిలో వైసీపీ ఘనవిజయం సాధించడం కూటమి వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
స్వయంగా హోంమంత్రి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేసిన ఎంపీటీసీ స్థానంలోనే వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం అనిత వర్గాన్ని షాక్‌కు గురిచేసింది.
ఓట్ల లెక్కింపు శనివారం పూర్తయి ఫలితాలు వెలువడగా, నక్కపల్లి 1, నక్కపల్లి 2 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు అద్భుత విజయాన్ని అందుకున్నారు. నక్కపల్లి-1లోతుమ్మ కల్పన, నక్కపల్లి-2లో గొడుగుల బంగార్రాజు విజేతలుగా నిలిచారు. అధికార పార్టీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
ఇక్కడ గమనించాల్సిన ప్రధానాంశం ఏమిటంటే.. నక్కపల్లి-2 ఎంపీటీసీ పరిధిలోనే హోంమంత్రి వంగలపూడి అనితకు ఓటు హక్కు ఉంది. నవంబర్ 5న నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 209వ పోలింగ్ బూత్‌లో ఆమె స్వయంగా క్యూలో నిలబడి ఓటు వేశారు.
అనిత స్వయంగా ఓటు వేసిన బూత్‌లోనే వైసీపీ విజయం సాధించడం ఆమె పట్ల క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అభిప్రాయం, కూటమి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను కళ్లకట్టినట్లు చూపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా ప్రచారం చేసినా సొంత బూత్‌లోనే ప్రజలు ఆమెను, కూటమి అభ్యర్థులను తిరస్కరించడం విశేషం.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల వేళ టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా దౌర్జన్యాలు, రిగ్గింగ్‌లు, భౌతిక దాడులకు పాల్పడుతున్నా, అనేక ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నా హోంశాఖ మంత్రిగా అనిత కనీసం స్పందించిన దాఖలాలు లేవు.
సొంత నియోజకవర్గంలో హోంమంత్రినే ఓటర్లు బూత్ స్థాయిలోనే దెబ్బకొట్టారని, ఇది కూటమి ప్రభుత్వ వ్యతిరేకతకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని శరఘాతం అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. హోంమంత్రి సొంత బూత్ ఫలితం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








