దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో(Paraguay) తీవ్ర రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంది. దేశంలో తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం(Banking Crisis) రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు శాంటియాగో పెనా (Santiago Pena) పదవిని కోల్పోయారు. పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ(Impeachment Process) ద్వారా ఆయనను తొలగించగా, గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా (Pedro Alliana) కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
పరాగ్వే పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్లో(Senate) పెనాపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. బ్యాంకింగ్ సంక్షోభం విషయంలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. శుక్రవారం జరిగిన ఓటింగ్లో హాజరైన 44 మంది సభ్యులు ఆయన తొలగింపునకు మద్దతు తెలిపారు. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు. అంతకుముందు గురువారం రాజీనామాకు(Resignation) సిద్ధమని పెనా ప్రకటించినప్పటికీ, ఎంపీలు అభిశంసన ప్రక్రియను కొనసాగించారు.
కొత్త అధ్యక్షుడిగా పెడ్రో అలియానా
పెనా(Pena) పదవి నుంచి తొలగిన అనంతరం ఉపాధ్యక్షుడు పెడ్రో అలియానా(Pedro Alliana) అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఆగస్టు 2028 వరకు బాధ్యతలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఆకస్మిక నాయకత్వ మార్పుతో పరాగ్వే రాజకీయ పరిణామాలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
పరాగ్వేలో సంక్షోభానికి ప్రధాన కారణం Ueno బ్యాంక్ మూసివేత. ఆర్థిక ఇబ్బందులు, చెల్లింపుల సమస్యలతో బ్యాంక్ సంక్షోభంలో పడటంతో కేంద్ర బ్యాంకు జోక్యం చేసుకుని తన నియంత్రణలోకి తీసుకుంది. దీంతో లక్షలాది ఖాతాదారులు తమ డిపాజిట్లు, బ్యాంకింగ్ సేవల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బ్యాంకుతో పెనాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని, ఆయన రాజకీయ ప్రభావంతో బ్యాంకుకు ప్రయోజనాలు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను పెనా ఖండించారు.
బ్యాంకింగ్ సంక్షోభంపై పరాగ్వే అటార్నీ జనరల్ కార్యాలయం పెనా, పలువురు మాజీ అధికారులపై మూడు వేర్వేరు క్రిమినల్ కేసుల విచారణ ప్రారంభించింది. విశ్వాస ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. అధ్యక్ష పదవి కోల్పోవడంతో ఆయనకు ఉన్న చట్టపరమైన రక్షణ ముగిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను గృహనిర్బంధంలో ఉంచాలని ప్రాసిక్యూషన్ అధికారులు ఆదేశించినట్లు కథనాలు వెల్లడించాయి.
ఎవరీ శాంటియాగో పెనా?
44 ఏళ్ల శాంటియాగో పెనా ఆగస్టు 2023లో పరాగ్వే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొలరాడో పార్టీకి (Colorado Party) చెందిన ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆర్థికవేత్తగా పనిచేశారు. గతంలో దేశ ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే లాటిన్ అమెరికా నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. పరాగ్వేలో నాయకత్వ మార్పు జరిగినప్పటికీ ఆ దేశంతో సంబంధాలు కొనసాగిస్తామని అమెరికా ప్రకటించినట్లు సమాచారం.








