వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసులో తొలి అంతర్జాతీయ పిలుపు అందుకోవడంతో క్రికెట్ అభిమానుల్లో అతనిపై ఆసక్తి పెరిగింది. ఇండోర్‌కు చెందిన సారాంశ్ కుడిచేతి ఆఫ్‌స్పిన్ బౌలర్‌గా, ఎడమచేతి బ్యాటర్‌గా జట్టుకు విలువైన సేవలు అందిస్తున్నాడు. 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు, ఇప్పటివరకు 181 వికెట్లు పడగొట్టడంతో పాటు 2,223 పరుగులు చేసి నిలకడైన ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు. ఐపీఎల్‌లో అవకాశం రాకపోయినా దేశీయ క్రికెట్‌లో చేసిన అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి చివరకు టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు.
సారాంశ్‌కు క్రికెట్ అంటే కుటుంబ వారసత్వమే. అతని తండ్రి సుభోధ్ జైన్ కూడా మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడిన ఆఫ్‌స్పిన్ బౌలర్. అయితే భారత జట్టుకు ఆడాలన్న ఆయన కలను ఇప్పుడు కుమారుడు సాకారం చేయబోతున్నాడు. 2022లో మధ్యప్రదేశ్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలో సారాంశ్ కీలక పాత్ర పోషించాడు. ముంబైతో జరిగిన ఫైనల్‌లో అర్ధశతకంతో పాటు కీలక వికెట్లు తీసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అప్పటి నుంచి దేశీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌కు ఇప్పుడు టీమిండియా నుంచి వచ్చిన తొలి పిలుపు అతని కృషికి దక్కిన గొప్ప గుర్తింపుగా క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








