బెజవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న జనసైనికుడు గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లాకప్‌డెత్ ఆరోపణలు, రాజకీయ విమర్శల మధ్య ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి, చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ దర్యాప్తు బాధ్యతలను విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్‌కు కాకుండా, మరో ఐపీఎస్ అధికారికి అప్పగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసును డీల్ చేసిన ఎస్పీకి గాదె సాయికృష్ణ కేసును అప్పగించారు.
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణపై లాకప్‌డెత్ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఒక ఐపీఎస్ అధికారితో నిష్పక్షపాతంగా జరిపించాలని ముఖ్యమంత్రి నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా విజయవాడ సీపీ రాజశేఖర్‌ను పక్కన పెట్టి, రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌ను విచారణాధికారిగా నియమించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఎస్పీ నరసింహ కిషోర్ నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు స్వయంగా చేరుకుని విచారణ ప్రారంభించనున్నారు.
సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఇంత పెద్ద దుమారం రేపుతున్నా, విజయవాడ పోలీసులు మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సీపీ నిర్లక్ష్యం వల్లే పోలీసులు విచ్చలవిడిగా ప్రవర్తించారని, అందుకే ఈ లాకప్‌డెత్ జరిగిందని ప్రతిపక్ష వైసీపీ కూడా తీవ్రంగా ఆరోపిస్తోంది. మరోవైపు 40-50 కేసులు ఉన్నాయని అధికార పార్టీకి చెందిన కొందరు ప్రచారం చేస్తుండగా, సాయికృష్ణపై కేవలం రెండు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై వాస్తవాలు వెలుపలికి రావాలంటే CBI దర్యాప్తు జరిపించాలని సాయికృష్ణ తల్లి డిమాండ్ చేస్తున్నారు.
నేడు కోర్టు కీలక ఆదేశాలు?
ఈ కేసులో నేడు మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. తన కుమారుడిని స్టేషన్‌కు తెచ్చి చిత్రహింసలు పెట్టారని, అసలు నిజాలు బయటపడాలంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ (CCTV) ఫుటేజ్, కాల్ డేటాను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి విజయవాడ రెండవ AJM కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు తన ఫోన్ లాక్కొని కాల్స్ చేశారని, వాటి వివరాలు కూడా సేకరించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌పై విజయవాడ కోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది.








