కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు సామాజిక వ‌ర్గ ఉద్య‌మ నేత‌, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో వైసీపీలో, కాపు సామాజిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ముద్ర‌గ‌డ మృతికి వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం యువకుడిగానే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు పొందుతూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వంతో పాటు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేసి పలు కీలక శాఖలను నిర్వహించారు. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగానూ ప్రజలకు సేవలందించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు.

ముద్రగడ పద్మనాభం పేరు చెప్పగానే కాపు రిజర్వేషన్ల ఉద్యమం గుర్తుకొస్తుంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆయన చేపట్టిన ఉద్యమాలు రాష్ట్రవ్యాప్తంగా సుప‌రిచిత‌మే. అనేక ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహించి కాపు ఉద్యమానికి నాయకత్వం వహించారు. దీంతో కాపు ఉద్యమ నేతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. అనంతరం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన రాజకీయ అనుభవాన్ని వినియోగించారు. దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ముద్రగడ పద్మనాభం మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక అధ్యాయానికి తెరపడింది. ఆయన సేవలను పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కాపు సంఘాల నాయకులు స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment