షాబాద్ హత్యాకాండ.. పోలీసులపై విజయశాంతి ఫైర్

షాబాద్ హత్యాకాండపై విజయశాంతి ఆగ్రహం..

Summarize with AI

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన దారుణ హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. ప్రధాన నిందితుడు జైలులో ఆత్మహత్య చేసుకున్నాడనే కారణంతో కేసు ముగిసిపోయిందని భావించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

గతంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో చట్టం కింద అరెస్టైన రాజ్‌కుమార్‌కు అంత తేలికగా బెయిల్ లభించడం వెనుక స్థానిక పోలీసుల నిర్లక్ష్యం, అవినీతి కారణమనే ఆరోపణలు వెలువడుతున్నాయని చెప్పారు. నిందితుడి నుంచి లంచం తీసుకుని కేసును బలహీనపరిచారనే వార్తలు మహిళల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.

రక్షణ కల్పించాల్సిన పోలీసుల వైఫల్యం వల్లే ఒకే కుటుంబానికి చెందిన అమాయకులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని విజయశాంతి అన్నారు. పోలీసు వ్యవస్థలోని లోపాలు, అవినీతి కారణంగా మహిళల భద్రతపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం షాబాద్ ఘటనను, దీనికి దారితీసిన పోలీసు వైఫల్యాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకూడదని ఆమె స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment