నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును తాను పొగిడినట్టుగా ఎల్లో మీడియా కథనాలు ప్రచారం చేసుకుంటోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ వై. విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
వైసీపీ సమావేశంలో తాను హంద్రీ-నీవా ప్రాజెక్టులో లైనింగ్ పనుల పేరుతో జరుగుతున్న అవినీతి, ప్రజాధన దోపిడీ గురించే స్పష్టంగా మాట్లాడానని తెలిపారు. ప్రాజెక్టుల పేరిట ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని విమర్శించానని, అయితే తన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఎల్లో మీడియా వార్తలు ప్రచురించిందని ఆరోపించారు. అలాగే ఆ వార్తలను ఆధారంగా చేసుకుని టీడీపీ నాయకులు రాజకీయ ప్రచారం చేయడం సిగ్గుచేటని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కృష్ణానది వరద జలాలను వీలైనంత వేగంగా రాయలసీమ ప్రాజెక్టులకు తరలించి, తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమకు మేలు చేసే ప్రాధాన్యతా పనులను పక్కనపెట్టి, లైనింగ్ వంటి పనుల పేరుతో భారీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారనే కారణంతో రాయలసీమకు అత్యంత కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నిలిపివేసి మూలనపడేశారని చంద్రబాబుపై విశ్వేశ్వరరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయానికి చంద్రబాబు రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో తన వ్యాఖ్యలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం దుర్మార్గమని ఆయన ఆరోపించారు.
ప్రజలకు తప్పుడు సమాచారం చేరకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నానని వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం రాజీలేని పోరాటం కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు.








