ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్థినులకు కనీస కూడా రక్షణ లేదు. అనంతపురం జిల్లా రాప్తాడులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన దారుణ ఘటన ఏపీలో విద్యాశాఖ పనితీరు, మహిళా రక్షణ పతానావస్థకు అద్దం పడుతోంది. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ దుండగుడు కట్టెలు కోసే రంపంతో దాడికి పాల్పడ్డాడు. తరగతి గదిలోనే బాలికపై విచక్షణారహితంగా రంపంతో దాడి చేయడంతో ఆమె కుడిచేయి తెగిపోయింది. అలాగే ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినిపై కూడా నిందితుడు దాడి చేయడంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన విద్యార్థినులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాఠశాల తరగతి గదిలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడటంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఈ ఘటనపై బాధిత బాలిక బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పాపను ఎవరైనా వేధిస్తున్నట్లు గతంలో ఎప్పుడూ చెప్పలేదని బాలిక మేనత్త వెల్లడించారు. ప్రతిరోజూ ఆటోలో పాఠశాలకు వెళ్తుంటుందని తెలిపారు. చిన్నారికి ప్రభుత్వ పాఠశాలలోనే రక్షణ లేకపోతే ఇక ఎక్కడ భద్రత ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు కట్టెలు కోసే రంపంతో నిందితుడు పాఠశాల లోపలికి ఎలా వచ్చాడు? బయట వ్యక్తులను పాఠశాలలోకి ఎలా అనుమతించారు? విద్యార్థుల భద్రతపై ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది బాధ్యత ఏమిటి? అంటూ ప్రశ్నించారు. నిందితుడు ఎవరైనా, చివరకు తమ బంధువే అయినా సరే కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో రాప్తాడులో తీవ్ర కలకలం రేగింది.








