ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. నేటితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు కూడా ముగియనుంది. పెన్షన్ల పంపిణీని అడ్డం పెట్టుకొని టీడీపీ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుతుస్తుందని ప్రతిపక్ష వైసీపీ అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ముసలి, ముతక, వికలాంగులకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను అడ్డం పెట్టుకుని గ్రామీణ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తీవ్ర రాజకీయ దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆధారాలను బయటపెట్టింది.
సాధారణంగా ఎన్నికల నియామావళి అమలులో ఉన్న సమయంలో ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు తావులేకుండా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ల పంపిణీ చేపట్టాల్సి ఉంటుంది. కానీ, రాష్ట్రంలో అధికార కూటమి నాయకులే స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి నగదు పంపిణీ చేస్తూ, తమకే ఓటు వేయాలంటూ బహిరంగంగా హుకుం జారీ చేయడం సంచలనంగా మారింది.
తిరుపతి జిల్లా రొంపిచర్ల మండలంలో, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండలంలో.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రలోభాల ప్రచారం బయటకు వచ్చింది. ఎన్నికల కోడ్ను బేఖాతరు చేస్తూ స్థానిక టీడీపీ నేతలు పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని నగదు పంపిణీ చేశారు.
పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు, వికలాంగులతో.. “వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి.. లేకపోతే వచ్చే నెల నుంచి మీ పింఛన్లు తీసేస్తాం, రాకుండా నిలిపివేస్తాం” అని బహిరంగంగా బెదిరింపులకు దిగారు. పేదరికంలో ఉన్న లబ్ధిదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని, ఓటు వేయకపోతే పొట్టగొడతామంటూ భయాందోళనలు సృష్టించడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో కూటమి నేతలు ఓటర్లను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని, ఈ పంపిణీ అధికారుల ద్వారానే జరిపించాలని లేదా ఓటింగ్ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని వైసీపీ ఎస్ఈసీని కోరింది. అధికారికంగా లేఖ కూడా రాసింది.
అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎన్నికల యంత్రాంగం, పోలీసులు కళ్లు అప్పగించి చూస్తుండటంతో కూటమి నేతలు స్వేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా అందాల్సిన పింఛన్లను తమ సొంత జేబుల్లోంచి ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఓటర్లను బెదిరించడం పట్ల ప్రజాస్వామ్యవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్లను అడ్డం పెట్టుకుని పేద ప్రజల ఓట్లను దారి మళ్లించేందుకు కుట్ర పన్నుతున్న కూటమి నాయకులపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి పంపిణీలో పాల్గొన్న నేతలను అరెస్టు చేయకపోతే ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారుతుందని హెచ్చరిస్తోంది.








