నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో రూ.24 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ!

నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో రూ.24 కోట్ల టోకరా.. రంగంలోకి ఈడీ!

Summarize with AI

హైదరాబాద్‌లో రూ.24 కోట్ల భారీ సైబర్ ట్రేడింగ్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు అలంరాజు సత్యనారాయణ మూర్తికి చెందిన నివాసాలు, వ్యాపార కార్యాలయాలే లక్ష్యంగా నగరంలోని మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయంటూ నిందితుడు బాధితులకు ఆశ చూపించాడు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా సందేశాల ద్వారా నిమేష్ అనే వ్యక్తిని సంప్రదించి, నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టించాడు. ఈ విధంగా విడతల వారీగా బాధితుడి నుంచి ఏకంగా రూ.24,76,21,042 వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే పెట్టుబడి సొమ్ముతో పాటు లాభాలను కూడా తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

2023 మే 23 నుంచి 2024 మే 27 మధ్య కాలంలో నిందితుడు సుమారు రూ.26.02 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. మోసానికి పాల్పడిన సొమ్ము మూలాలను దాచేందుకు పలు మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా నిధులను మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేర్లతో పలు వ్యాపార సంస్థలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆశ్రిత ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో హైదరాబాద్‌లో లగ్జరీ విల్లా ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు BTR ఇండస్ట్రీస్, వెలుగు ట్రేడింగ్ కంపెనీ, ఆశ్రిత మెగా సొల్యూషన్స్ పేర్లతో సంస్థలను నిర్వహించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఈడీ సోదాల్లో నిందితుడి నివాసం నుంచి రూ.6.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడికి చెందిన 11 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.14 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. మోసపూరిత లావాదేవీల ద్వారా సమకూర్చుకున్నట్లు అనుమానిస్తున్న సుమారు రూ.5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లాను కూడా గుర్తించారు. తనిఖీల్లో లభించిన కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో నిధుల మళ్లింపు, ఆస్తుల సమీకరణకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment