తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు..

తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు..

Summarize with AI

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం తగ్గినప్పటికీ, దాని అనుబంధంగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి తూర్పు మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించిన అల్పపీడన అవశేషం కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ అండమాన్‌ సముద్రంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడటంతో రానున్న రెండు రోజుల్లో అది ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు కదిలే అవకాశాలున్నాయి. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో తెలంగాణలో నవంబర్‌ 3వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా శని, ఆది, సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. గత నెలన్నర రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శుక్రవారం కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు.

శుక్రవారం హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కీసరలో అత్యధికంగా 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో 8.9 సెం.మీ., బీబీనగర్‌, బహదూర్‌పుర, జూపార్క్‌ ప్రాంతాల్లో 8.2 సెం.మీ. వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రానున్న మూడు, నాలుగు రోజులు వర్ష సూచన ఉండబోతుందని అధికారులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment