సీఎం చంద్రబాబు (CM Chandrababu) క్రెడిట్ చోరీపై (Credit Theft) వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మరోసారి సెటైర్లు పేల్చారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు (Bhogapuram Airport) సంబంధించిన ఆధారాలు బయటపెడుతూనే చంద్రబాబు రాజకీయం గురించి విమర్శలు సంధించారు. ఈ మేరకు వైఎస్ జగన్ భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి పలు ఆధారాలతో ట్వీట్ చేశారు.
ఉత్తరాంధ్ర వాసుల కల, భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవడం ఉత్తరాంధ్రకు గర్వకారణమని వైఎస్ జగన్(YS Jagan) అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం వల్ల ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ గుర్తింపు లభించి, వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందన్నారు.
అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ను ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. “పని వైసీపీది(YSRCP)… ప్రచారం చంద్రబాబుది (Chandrababu). క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్ (Credit Without Contribution) అదే చంద్రబాబు మార్కు రాజకీయం” అంటూ విమర్శించారు.
2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపనలో ఒక రాయి వేయడం తప్ప చంద్రబాబు ఎలాంటి పని చేయలేదని, జూన్ 2020లో జీఎంఆర్‌తో (GMR) కన్సెషన్ అగ్రిమెంట్ (Concession Agreement) కుదుర్చుకోవడం నుంచి భూసేకరణ, పునరావాసం (R&R), సైట్ క్లియరెన్స్, అన్ని ఎన్‌ఓసీలు, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్, అంతర్గత రోడ్లు, ఏరోనాటికల్ సర్వీసులు, ఆర్థిక సమీకరణ వంటి కీలక ప్రక్రియలన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయన్నారు.
చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన భూసేకరణను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని, నిర్వాసితులైన నాలుగు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించిందని తెలిపారు. భూసేకరణ (Land Acquisition), ఆర్ అండ్ ఆర్ (R&R) కోసం రూ.967 కోట్లు, నీటి సరఫరాకు రూ.75 కోట్లు, మౌలిక వసతులకు రూ.134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్లకు రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్‌కు రూ.2.35 కోట్లు కలిపి మొత్తం సుమారు రూ.1,200 కోట్లు తమ ప్రభుత్వమే ఖర్చు చేసిందని వెల్లడించారు.
ఈ పనులన్నీ పూర్తిచేయడం వల్లే కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే విమానాశ్రయ నిర్మాణం వేగంగా సాగి, 2024 ఎన్నికల నాటికే రన్‌వే కీలక దశకు చేరిందని, టెర్మినల్ నిర్మాణం కూడా ముందుకు వెళ్లిందని జగన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే 2026 జూన్‌లో భోగాపురం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రకటించామని, ఇప్పుడు ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం ఆ కృషి ఫలితమేనన్నారు.
విశాఖపట్నం (Visakhapatnam) నుంచి భోగాపురం విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు అవసరమైన 77 మీటర్ల వెడల్పు, 55 కిలోమీటర్ల ఆరు లేన్ల రహదారిని రూ.6,300 కోట్లతో నిర్మించాలని కేంద్రంపై తమ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని, అప్పట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆ ప్రాజెక్టును ప్రకటించారని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఆ రహదారిని ముందుకు తీసుకెళ్లలేదని ఆరోపించారు.
ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్న జగన్, పని చేయకుండా ప్రచారం చేసుకోవడం, ఇతరుల కృషికి క్రెడిట్ తీసుకోవడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు.
పని వైయస్సార్‌సీపీది … ప్రచారం చంద్రబాబుది!
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 29, 2026
‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’-అదే చంద్రబాబు మార్కు రాజకీయం
ఉత్తరాంధ్ర కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావడం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో… pic.twitter.com/4U4LftlJDM







