రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకుని ప్రాణాలు విడిచారు.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో కానిస్టేబుల్ స్వామి డీజీపీ ఆఫీస్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. తుపాకీ పేలిన శబ్దం విన్న తోటి సిబ్బంది వెంటనే వాష్‌రూమ్ వద్దకు పరుగెత్తుకెళ్లగా, స్వామి రక్తం మడుగులో పడివున్నారు. తీవ్ర గాయాలవ్వడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఓ నోట్‌బుక్‌లో స్వామి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో ఆయన అత్యంత భావోద్వేగంగా స్పందించారు. “నా భార్య, పిల్లలు చాలా మంచివాళ్ళు. వాళ్ళను ఎవరూ ఏమీ అనవద్దు, తప్పుపట్టవద్దు. నేను చనిపోయి దయ్యమైనా సరే.. వాళ్ళను ఎల్లప్పుడూ చూసుకుంటూనే ఉంటాను” అని సూసైడ్ నోట్‌లో రాసి ఉంది.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








