ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా నిర్వహించాల్సిన గార్డ్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి ఆటంకం కలిగించారని, విధుల్లో ఉన్న పోలీసులను ఉద్దేశపూర్వకంగా తోసివేశారని ఆరోపిస్తూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఏఆర్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
ఈ కేసుపై అంబటి రాంబాబు స్పందించారు. ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలు అవసరం లేదని ఆయన కుటుంబ సభ్యులే స్పష్టంగా తిరస్కరించారని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముద్రగడను, ఆయన కుటుంబాన్ని తీవ్రంగా వేధించి అవమానాలకు గురిచేసిందని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వ లాంఛనాలు తమకు అవసరం లేదనే ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులు నిరాకరించారని చెప్పారు.
“బలవంతంగా వచ్చి అధికారిక లాంఛనాలు నిర్వహిస్తే ముద్రగడ ఆత్మకు శాంతి ఉండదు. అందుకే మేము అడ్డుకున్నాం” అని అంబటి వ్యాఖ్యానించారు.
పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా గేట్లు దూకి ఇంట్లోకి ప్రవేశించారని అంబటి ఆరోపించారు. “వద్దని చెప్పిన తర్వాత కూడా లోపలికి రావడానికి పోలీసులు ఎవరు? అది ముద్రగడ ఇల్లు. అక్కడ ఏం జరగాలనేది ఆయన కుటుంబ సభ్యుల ఇష్టప్రకారమే జరగాలి. దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించే అధికారం పోలీసులకు లేదు” అని అన్నారు.
తనపై మరిన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ప్రతి చిన్న విషయానికీ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని విమర్శించారు. నమోదైన అన్ని కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేసిన అంబటి రాంబాబు, అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులపై తాను ట్రెస్‌పాస్ కేసు కూడా నమోదు చేస్తానని ప్రకటించారు.








